పాములాగా బుసలు కొడుతూ నాగిని డాన్స్ చేసిన వరుడు.. షాకిచ్చిన వధువు

శుక్రవారం, 30 జూన్ 2017 (09:34 IST)
పీకల వరకు మద్యం సేవించి పాములాగా బుసలు కొడుతూ నాగిని డాన్స్ చేసిన వరుడికి ఓ వధువు షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్ నగరంలో జరిగిన సంఘటన వివరాలను పరిశీలిస్తే....
 
షాజహాన్‌పూర్ నగరానికి చెందిన ప్రియాంక త్రిపాఠి (23), అనుభవ మిశ్రాల పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. పెళ్లికి ముందు జరిగిన రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వధూవరులు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఆపై పెళ్లి వేడుక ప్రారంభానికి ముందు వధువు కుటుంబానికి ఆహ్వానం పలికే కార్యక్రమం జరగాల్సి ఉంది. 
 
ఈ కార్యక్రమంలో వరుడు అనుభవ మిశ్రా పీకల దాకా మద్యం సేవించి డీజే సౌండు మధ్య వివాహ వేడుకల్లో స్నేహితులతో కలిసి నాగిని నృత్యం చేశాడు. వరుడు పాములాగా బుసలు కొడుతూ కింద పొర్లుతూ నృత్యం చేస్తుండగా అతని స్నేహితులు ఆయనపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. వరుడి నాగిని నృత్యం చూసిన వధువు షాక్‌కు గురైంది. 
 
కొద్దిసేపటి తర్వాత తేరుకున్న వధువు... తాగుబోతు వరుడి తనకు వద్దని కరాఖండిగా తేల్చి చెప్పి.. పెళ్లి రద్దు చేసుకుంది. వరుడి బంధువులు ఎంతగా బతిమాలినా వధువు మాత్రం ససేమిరా అంటూ పెళ్లి మండపం నుంచి ఇంటికి వెళ్లిపోయింది. 

వెబ్దునియా పై చదవండి