జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో తొలిసారి ఫార్ములా-4 కార్ల రేసింగ్ పోటీలు జరిగాయి. శ్రీనగర్‌లోని దాల్ సరసు వెంబడి ఈ పోటీలను నిర్వహించారు. కార్లతో డ్రైవర్ల సాహసకృత్యాలను చూసిన కాశ్మీర్ ప్రజలు ఆశ్చర్యపోయారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఈ తరహా పోటీలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఈవెంట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. మోటార్ స్పోర్ట్స్ రంగానికి సంబంధించి భారత్‌లో అనేక అవకాశాలు ఉన్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు.
శ్రీనగర్ వేదికగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రేగింగ్ లీగ్ ఈ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం చూసి తన మనసు ఆనందంతో నిండిపోయిందన్నారు. మోటార్ స్పోర్ట్ రంగానికి భారతదేశంలో అనేక అవశకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి శ్రీనగర్ ముందు వరుసలో నిలిచిందన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు టూరిజం శాఖ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు.
శ్రీనగర్‌లోని దాల్ సరస్సు తీరం వెంబడి లలిత్ ఘాట్ నుంచి నెహ్రూ పార్క్ వరకూ 1.7 కిలోమీటర్ల ట్రాక్‌పై ఫార్ముల-4 కార్ల ప్రదర్శనను నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సాగిన కార్యక్రమంలో దూసుకుపోయిన కార్లను వీక్షించి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. కార్లతో ఫార్ములా-4 డ్రైవర్ల విన్యాసాలు అనేక మందిని ఆకట్టుకున్నాయి.
కార్యక్రమం అనంతరం యువత ఫార్ములా-4 డ్రైవర్లతో మాట్లాడారు. రేసింగ్‌కు సంబంధించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ రంగంపై ఆసక్తి పెంచేలా ఫార్ములా డ్రైవర్లు యువతతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఫార్ములా-4 ఈవెంట్ కేవలం కార్ల రేసింగ్, పోటీకి సంబంధించినది మాత్రమే కాదని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఐక్యతకు, ప్రతికూలతలు తట్టుకునే సామర్థ్యానికి చిహ్నమని అన్నారు. ఫార్ములా-4 డ్రైవర్ల స్ఫూర్తితో మరింత మంది కాశ్మీరీ యువత రేసింగ్ రంగంలో కాలుపెడతారని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు.
తొలిసారిగా జరిగిన ఈ ఈవెంట్‌కు అక్కడి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫార్ములా-4కు అనుకూలంగా ట్రాక్‌ను తీర్చిదిద్దారు. ట్రాక్ వెంబడి పలు చోట్ల వైద్య బృందాలను, అగ్నిమాపక వ్యవస్థలను అందుబాటులో ఉంచారు. కార్యక్రమం మొత్తాన్ని డ్రోన్లతో పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ్