ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేశ్యలు డబ్బులు తీసుకుని సుఖ పెట్టడమేకాకుండా, కోరితే వేదికలెక్కి నృత్యం కూడా చేస్తారని చెప్పారు. కానీ, ప్రభుత్వ అధికారులు మాత్రం డబ్బులను లంచాల రూపంలో తీసుకుని పనులు చేయరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన తాజాగా మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారుల కంటే వేశ్యలే నయమన్నారు. 'ప్రభుత్వాధికారుల కంటే వేశ్యలు ఉత్తమమైన వారని, వారు కనీసం డబ్బు సంపాదించేందుకు వేదికపై నృత్యం చేస్తారని, కానీ ఈ ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి డబ్బు తీసుకున్న తర్వాత కూడా పనిని చేయటం లేదు' అని ఆరోపించారు. ఇాలాంటి అధికారులకు వ్యతిరేకంగా నినాదుల చేస్తానని చెప్పారు.
అదేసమయంలో ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ పిలుపునిచ్చారు. 'వేశ్యలకు సమాజం మొత్తం వేశ్యలలాగానే కనిపిస్తారు' అని గతంలో వ్యాఖ్యానించారు. గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల పర్వంలోనూ సురేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలు ఇస్లాంకు భగవంతుడికి మధ్య పోరు లాంటిదన్నారు. అలాగే, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని రావణుడి చెల్లెలు శూర్ఫణఖతో పోల్చి వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే.