కొత్త ప్రదేశానికి వెళితే ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్‌పై ఆధారపడుతున్నారు. కొత్త ప్రదేశంలో మనం వెళ్లదలచుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు ఈ గూగుల్ మ్యాప్ ఎంతగానో దోహదపడుతుంది. అలాంటి గూగుల్ మ్యాప్ ఇపుడు... పలువురి వైవాహిక జీవితాలను కూడా చిన్నాభిన్నం చేస్తోంది. దీనికి నిదర్శనమే తమిళనాడు రాష్ట్రంలోని జరిగిన ఓ సంఘటన. ఓ బాధితుడు ఈ గూగుల్ మ్యాప్ వల్ల తన దాంపత్యం జీవితం, వైవాహిక జీవితం నాశనమై... ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నాననీ, అందువల్ల గూగుల్ మ్యాప్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మైలాడుదురైలో వెలుగు చూసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, మైలాడుదురైకు చెందిన 49 యేళ్ల చంద్రశేఖర్ ఓ ఫ్యాన్సీ షాపును నడుపుతున్నారు. ఈయన తాజాగా స్థానిక పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో గూగుల్ మ్యప్‌పై చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడ్డారు. ఇంతకీ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే,
''గత కొద్ది నెలలుగా నా భార్య నిత్యం గూగుల్ మ్యాప్స్‌లోని 'యువర్ టైమ్‌లైన్' ఫీచర్‌ను తనిఖీ చేస్తోంది. ఎక్కడెక్కడ తిరిగావో చెప్పాలంటూ రాత్రి పూట కనీసం కూడా పోనివ్వడం లేదు. అస్తమానం దీని గురించే ఆలోచిస్తూ తన ఆరోగ్యం పాడుచేసుకుంది. తనతోపాటు మిగతా కుటుంబ సభ్యులందరి మీదా ఆ ప్రభావం పడింది. తాను వెళ్లని ప్రదేశాలను కూడా వెళ్లినట్టు గూగుల్ మ్యాప్స్‌లో చూపించడం వల్లే రకరకాల అనుమానాలు, సమస్యలు తలెత్తుతున్నాయి.
ఆమె సంధించే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు చివరికి కౌన్సిలర్లు చెప్పినా ఆమె వినిపించుకోవడం లేదు. ఏదైనా సరే గూగుల్‌నే నమ్ముతానని పట్టుపడుతోంది. గూగుల్ నా కుటుంబ జీవితాన్ని నాశనం చేసింది. కాబట్టి గూగుల్‌పై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి. నా కుటుంబంలో కలహాలు రేపినందుకు గూగుల్ నుంచి పరిహారం ఇప్పించాలని కూడా కోరుతున్నాను" అని చంద్రశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.