ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసు తాలూకు దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారానికి గురైన బాధితురాలి తండ్రిని బీజేపీ ఎమ్మెల్యే సోదరుడు గొడ్డును కొట్టినట్టు కొట్టడం వల్లే చనిపోయాడు. దీనికి సంబంధించిన బాధితుడు మాట్లాడిన వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. ఇది బీజేపీ పాలకుల నోట్లో పచ్చివెలక్కాయపడ్డట్టయింది.
తన కుమార్తెపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ అత్యాచారం చేశారనీ, అతనిపై కేసు నమోదు చేయాలంటూ బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగాడు. అయినా పోలీసులు కేసు పెట్టలేదు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా నోరుమెదపలేదు. పైగా, బాధితురాలి తండ్రిపైనే కేసు తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చితక్కొట్టారు. ఈ దెబ్బలకు తాళలేక బాధితురాలి తండ్రి చనిపోయాడు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనమైంది.
దీనిపై బాధితురాలు స్పందిస్తూ, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, అతని అనుచరులు తన తండ్రినే కాకుండా పెద్దనాన్నపై కూడా దాడిచేసి చంపివేశారని చెప్పారు. తనను జిల్లా యంత్రాంగం హోటల్ గదిలో బంధించారని, ఎవరితోనూ మాట్లాడనివ్వడం లేదన్నారు. అదేసమయంలో బాధితురాలి తండ్రి చనిపోయే ముందు మాట్లాడిన ఒక వీడియో బయటకు వచ్చింది. ఎమ్మెల్యే సోదరుడు, అతని అనుచరులు తనను తుపాకీ మడమతో విచక్షణారహితంగా కొట్టారని ఆయన ఆ వీడియోలో ఆరోపించారు.
ఈ ఘటనలపై ఓ న్యాయవాది అలహాబాద్ హైకోర్టుకు రాసిన లేఖను న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ఆ యువతి తండ్రి మృతదేహానికి ఇంకా అంత్యక్రియలు నిర్వహించనట్లయితే నిలుపుదల చేయాలని ఆదేశించింది. అయితే మంగళవారమే అతని అంత్యక్రియలు పూర్తయినట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన ఒక పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఘటనలన్నింటిపై సీబీఐ విచారణ జరిపించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ఉన్నావ్ ఘటనలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి అని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది.