టోల్ గేట్ వివాదం.. మహిళా ఉద్యోగిని ముక్కుపై పిడిగుద్దులు (Video)
శుక్రవారం, 21 జూన్ 2019 (15:51 IST)
టోల్ గేట్ రుసుము చెల్లించే అంశంపై ఏర్పడిన వివాదం ఓ మహిళా ఉద్యోగినిపై దాడికి కారణమైంది. హర్యానాలోని ఓ టోల్‌గేట్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిపై ఓ కారు డ్రైవర్ దాడికి పాల్పడటానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. హర్యానా గుర్గామ్ అనే ప్రాంతంలోని టోల్‌గేట్‌లో ఓ మహిళా ఉద్యోగిని పనిచేస్తుంది.
ఆ సమయంలో కారులో వచ్చిన వ్యక్తికి ఆమెకు టోల్ చెల్లింపు అంశంపై వాగ్వివాదం జరిగింది. దీంతో ఆవేశానికి గురై కారులో ప్రయాణించిన వ్యక్తి టోల్ గేట్ బూత్ వద్దనున్న గేటును ఢీకొని.. మహిళా ఉద్యోగినిపై ముక్కుపై పిడుగుద్దులు గుద్ది పారిపోయాడు.
ఈ ఘటనలో టోల్ గేట్ మహిళా ఉద్యోగిని ముక్కుకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే సహ ఉద్యోగులు గాయమైన ఉద్యోగినిని ఆస్పత్రికి తరలించారు. ఈ తతంగమంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.
ఈ ఘటనపై టోల్ గేట్ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టోల్ గేట్ మహిళా ఉద్యోగినిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.