దేశ వ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్‌లో గోధుమ పంట సాగబడి 16 శాతం మేరకు తగ్గింది. ఈనెల 26వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా 123.89 లక్షల హెక్టార్లలో ఈ పంటను సాగుబడి చేయగా, గత యేడాది ఇదేసమయానికి 148.20 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగుబడి చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే, ఆయిల్ విత్తనాల పంటలు కూడా ఈ రబీ సీజన్‌లో 12 శాతం మేరకు తగ్గాయి. 2010-11 సంవత్సరంలో నవంబరు 26వ తేదీ నాటికి 65.81 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగుబడి చేస్తుండగా, గత యేడాది 75.07 లక్షల హెక్టార్లుగా ఉన్నది. అలాగే, వేరుశెనగ, సన్‌ఫ్లవర్ పంటల సాగుబడి కూడా తగ్గాయి. వేరుశెనగ పంట 4 శాతం, సన్‌ఫ్లవర్ పంట సాగుబడి 18 శాతం మేరకు తగ్గినట్టు ఆ ప్రకటన పేర్కొంది.