సీఎల్పీ భేటీలో జగన్ ప్రస్తావన వస్తే జగడమే: వైఎస్ వర్గం!
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం మేరకు బుధవారం సాయంత్రం జరిగే సీఎల్పీ అత్యవసర సమావేశంలో వైఎస్ వర్గం అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై ఎదురుదాడికి దిగాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు.
ముఖ్యంగా, జగన్‌పై చర్య తీసుకునే ముందు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా మాట్లాడుతున్న సీనియర్ నేతల జాబితాను కూడా తయారు చేశారు. క్రమశిక్షణా చర్య తీసుకుంటే ముందుగా వీరిపై తీసుకుని ఆ తర్వాత జగన్ జోలికి రావాలని వారు సీఎల్పీ భేటీలో తెగేసి చెప్పనున్నారు. ఈ మాటలను జగన్ వర్గీయులైన ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ, మరికొంతమంది ఎమ్మెల్యేలు మీడియాకు అన్నారు.
పార్టీని గానీ, పార్టీ అధినేత్రిని గానీ ఎక్కడా కూడా పల్లెత్తు మాట అనని జగన్‌పై చర్య ఎందుకు తీసుకుంటారని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ సాక్షి కథనాన్ని ప్రధానంగా చేసుకుని జగన్‌పై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని భావిస్తే.. తొలుత పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తూ ప్రసంగాలు చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఏది ఏమైనా.. సాయంత్రం 6.30 గంటలకు జరిగే సీఎల్పీ భేటీ అత్యంత కీలకంగా మారనుంది. ఇందులో జగన్ అంశం ప్రస్తావనకు వస్తే మాత్రం సమావేశం రసాభాసగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని జగన్ వర్గీయులే బహిరంగంగా ప్రకటించారు. ఇదిలావుండగా, ఈ భేటీకీ జగన్మోహన్ రెడ్డి గైర్హాజరుకానున్నారు.