కాంగ్రెస్ పెద్దలతో కేకేఆర్ మంతనాలు: నేడే హైదరాబాద్‌కు!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన మంతనాలు పూర్తయ్యాయి. శనివారం ఉదయాన్నే ఢిల్లీకి చేరుకున్న ఆయన.. మధ్యాహ్నం వరకు బిజీబిజీగా గడిపారు.
సీఎం హోదాలో తొలిసారి హస్తినలో అడుగుపెట్టగానే కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. ఆ తర్వాత హోం మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ, ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌లతో భేటీ అయ్యారు. చివరగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమై 20 నిమిషాల పాటు చర్చించారు.
ఈ చర్చల్లో కొత్త మంత్రివర్గం కూర్పు, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, వైఎస్.జగన్ అంశాలను క్లుప్తంగా చర్చించినట్టు సమాచారం. ఆ తర్వాత ఏపీ భవన్‌కు చేరుకుని అక్కడ మంత్రి పదవుల కోసం తమ శక్తిమేరకు పావులు కదుపుతున్న ఆశావహులతో సహా రాష్ట్ర ఎంపీలను కలుసుకున్నారు. అనంతరం ఆయన శనివారం రాత్రికే హైదరాబాద్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
కాగా, ఈ దఫా కొత్త మంత్రివర్గంలో 40 శాతం కొత్త ముఖాలకే చోటు లభించనుంది. ఆ దిశగా ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో 11 నుంచి 15 మంది కొత్తవారికి కేబినెట్‌లో స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గం ఆదివారం మధ్యాహ్నాం లేదా బుధవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.