రైతు సమస్యలపై దద్దరిల్లిన సభ: ఆపై 15 నిమిషాలు వాయిదా!
రైతు సమస్యలపై శాసనసభ దద్ధరిల్లింది. శాసనసభ శీతాకాల సమావేశాలు రెండో రోజైన శనివారం విపక్షాలు రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టాయి. ఈ సందర్భంగా విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు.
తెలంగాణ విద్యార్థులపై కేసులను ఎత్తివేయాలంటూ తెరాస పట్టుబట్టింది. రైతు సమస్యలపై వెంటనే చర్చ ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పట్టుపడుతూ.. పోడియం ముందుకు దూసుకెళ్లడంతో డిప్యూటీ స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
అంతకుముందు రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ పాదయాత్ర నిర్వహించింది. ఎన్టీఆర్ ఘాట్ నుంచి అసెంబ్లీకి తెదేపా నేతలు పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడూతూ.. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు.
మరోవైపు అసెంబ్లీలో నేడు విపక్షాలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. వర్షాలతో రంగు మారిన ధాన్యం కొనుగోలు, కౌలు రైతులకు పరిహారం అంశంపై ప్రజారాజ్యం, ముస్లిం యువకులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేతపై ఎంఐఎం.. హోంగార్డుల జీతాల సమస్యల పరిష్కారంపై భాజపా వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.