శీతాకాల శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన శనివారం వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాలు రైతు సమస్యలపై పట్టుబట్టడంతో ప్రారంభమైన ఒకటిన్నర గంటలోపే సభ రెండు సార్లు వాయిదా పడింది. రైతు సమస్యలు, తెలంగాణ విద్యార్థులపై కేసుల ఎత్తివేయాలని విపక్షాలు పట్టుబట్టాయి.
రైతు సమస్యలతో పాటు తెలంగాణ విద్యార్థుల కేసులపై ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ స్పీకర్ నాదెళ్ల మనోహర్ ఎన్నిసార్లు నచ్చజెప్పినా విపక్షాలు పట్టు విడలేదు. ఇంకా పోడియం ముందుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. దీంతో డిప్యూటీ స్పీకర్ మరో అరగంట పాటు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంశంపై ఆయన నేతలతో చర్చలు జరిపారు. విద్యార్థులపై ఉన్న అన్ని కేసులను ఎత్తివేయాలని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కోరారు. ప్రతి కేసునూ ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉంటుందన్న సీఎం దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేస్తామని వెల్లడించారు.