శీతాకాల సమావేశాల్లో రెండో రోజైన శనివారం వాయిదాల పర్వం కొనసాగింది. తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు స్పీకర్ పోడియం ముందు బైఠాయించి, నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంతసేపటికీ తెరాస సభ్యులు పట్టువీడకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ నాదెళ్ల మనోహర్ ప్రకటించారు.
అంతకుముందు తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభ మూడు సార్లు వాయిదా పడింది. ప్రభుత్వం చర్చకు సానుకూలంగా ఉందని డిప్యూటీ స్పీకర్ ప్రకటించినప్పటికీ, విపక్ష నేతలు సభలో గందరగోళం సృష్టించడంతో డిప్యూటీ స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
అంతకుముందు సభను సజావుగా నడిపించేందుకు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం సమావేశమయ్యారు. శనివారం శాసనసభ ప్రారంభమైన గంటలోపే రెండు సార్లు వాయిదా పడింది.
దీంతో సభలో విపక్షాల నిరసన, సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని రైతు సమస్యలు, తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తి వేయడానికి ప్రభుత్వం ప్రకటన ఇచ్చేందుకు సిద్ధంగా ఉందనే విషయంపై డిప్యూటీ స్పీకర్ ఫ్లోర్ లీడర్లతో చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశానికి అనంతరం ప్రారంభమైన సమావేశాల్లో తిరిగి విపక్షాలు యధాతథంగా స్పీకర్ పోడియం ముందు బైఠాయించి.. ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేయడంతో డిప్యూటీ స్పీకర్ సభను వాయిదా వేయక తప్పలేదు.
మరోవైపు రైతు సమస్యలపై చర్చలు జరగలేదని తెలుగుదేశం పార్టీ సభ్యులు అసెంబ్లీలోనే ఉండిపోయారు. శీతాకాల సమావేశాలు జరిగిన రెండు రోజుల్లో రైతు సమస్యలపై చర్చలు జరగకపోవడం గమనార్హం.