కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవ యాత్రను కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, అఖిలాంధ్రులకు నాటి నుంచి నేటి వరకు అభిమాన హీరో అయిన నందమూరి తారకరామారావు (సీనియర్) విగ్రహానికి దండ వేసేందుకు సమయం చాలదని ఆయన చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ యాత్రలో భాగంగా చంద్రబాబు సోమవారం రెడ్డిగూడెం మండలం మెట్టగూడెం చేరుకున్నారు. అయితే, అక్కడున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయాలని చంద్రబాబును అభిమానులు కోరారు. కానీ, అందుకు ఆయన నిరాకరించారు. అంతేకాదు, విగ్రహాలకు పూలమాలలు వేస్తూపోతే సమయం సరిపోదన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆ వెంటనే ఏకమైన అభిమానులు బాబు యాత్రతో పాటు.. ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. అయితే, ఈ సంఘటనతో చంద్రబాబు వెంట ఉన్న ప్రైవేటు సైన్యం వారిని పక్కకు లాగేసి, యాత్రను ముందుకు వెళ్లనిచ్చింది.