ముఖ్యమంత్రి రాజీనామా...!: వైఎస్ జగన్ విజయమా...?!!

వైఎస్సార్ అకాల మరణానంతరం సీఎం పీఠాన్ని అధిష్టించిన రోశయ్యకు ఆది నుంచి అన్నీ ఒడిదుడుకులే ఎదురయ్యాయి. సీఎంగా ఆయనకు అధిష్టానం మద్దతు తప్ప రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల సంపూర్ణ మద్దతు లభించలేదు. ఆయన పదవి అధిష్టించిన రెండు నెలలకే తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది.

ఆ ఉద్యమం ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలమైంది. రాజకీయ పార్టీలు నిట్టనిలువునా చీలిపోయాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే వైఎస్ జగన్ వర్గం ఆది నుంచీ రోశయ్య ముఖ్యమంత్రిత్వాన్ని వ్యతిరేకిస్తూనే వస్తోంది. అదను దొరికినప్పుడల్లా ఆయనను తూర్పారబడుతూనే ఉన్నది.

ముఖ్యమంత్రి రోశయ్య జగన్‌ను తన కుమారుడిలాంటివాడనీ, సీఎం పదవికోసం కాస్త ఓపిక పట్టాలని పరోక్ష సంకేతాలిచ్చినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం ససేమిరా అన్నట్లే కనబడింది. వరంగల్ ఓదార్పు యాత్ర సమయంలో కొండా సురేఖ దంపతులపై జరిగిన దాడి సమయంలో రోశయ్యకు బాధ్యత లేదా..? అంటూ జగన్ ముఖ్యమంత్రి రోశయ్యను ఏకవచనంతో సంబోధించడంపై దుమారం రేగింది.

అప్పటి నుంచే రోశయ్యకు జగన్‌కు దూరం మరింత పెరిగింది. దీనికితోడు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఓదార్పు యాత్ర చేపట్టడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌లో వేడిని రగిల్చారు. ఓదార్పు యాత్రలో పాల్గొనాలంటూ ఎమ్మెల్యేలపై పరోక్షంగా ఒత్తిడి చేశారన్న ఆరోపణలు సైతం వచ్చాయి. ఓదార్పు యాత్ర, సీఎం పీఠంకోసం చేస్తున్న యాత్రగా జగన్ వ్యతిరేక వర్గం ప్రచారం చేసింది.

ఏదేమైనా వైఎస్ జగన్ వర్గం ఆది నుంచి ముఖ్యమంత్రి రోశయ్యను పదవి నుంచి ఉద్వాసన పలికే విధంగా చేయడంలో విజయం సాధించారన్న వాదనలు సైతం వస్తున్నాయి. అయితే ఈ విజయంలో వైఎస్ వర్గానికి వనగూరే ప్రయోజనం ఏమిటన్నది చూడాలి.

వెబ్దునియా పై చదవండి