భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి ఎల్‌కే అద్వానీ ఆర్ఎస్ఎస్‌కు బానిస అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. అద్వానీ దాని మద్దతు లేకుండా ఏ నిర్ణయం తీసుకోలేరంటూ ఆమె పేర్కొన్నారు.
కర్ణాటకలోని బీదర్‌లో బుధవారం జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న సోనియాగాంధీ మాట్లాడుతూ బీజేపీలో తన స్థానాన్ని బలీయం చేసుకోవడం కోసం అద్వానీ ఆర్ఎస్ఎస్‌కు మద్దతు పలుకుతారంటూ దుయ్యబట్టారు. ఈ కారణంగానే ప్రతీ ఒక్క విషయానికి అద్వానీ ఆర్ఎస్ఎస్‌పైన ఆధారపడుతారని ఆమె తప్పుబట్టారు.
అదేసమయంలో మన్మోహన్‌ను బలహీన ప్రధానిగా అద్వానీ పదేపదే విమర్శించడాన్ని ఆమె కొట్టిపారేశారు. మన్మోహన్‌ను విమర్శించే అద్వానీ ఆర్ఎస్ఎస్ మద్దతు లేకుండా నిర్ణయం తీసుకోవాలంటూ సవాల్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో పాకిస్థాన్ పర్యటన సందర్భంగా జిన్నాను లౌకికవాదిగా కీర్తించిన అద్వానీ ఆర్ఎస్ఎస్ మండిపడడంతో ఆ సమయంలో తన పదవినుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఎద్దేవా చేశారు.
అలాగే ఆమె మాట్లాడుతూ ప్రధాని అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించినవారు కాదని, ఆయన దేశం మొత్తానికి సంబంధించినవారన్న విషయాన్ని అద్వానీ గుర్తుపెట్టుకోవాలని సోనియా సూచించారు. అందుకే ప్రధానిని విమర్శించడమంటే మొత్తం దేశాన్నే విమర్శించినట్టని అద్వానీపై ఆమె తీవ్రస్వరంతో మండిపడ్డారు.