స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు: పవార్

శనివారం, 13 మార్చి 2010 (16:44 IST)
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్లు కల్పించాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్, కేంద్ర ఆహార శాఖామంత్రి శరద్ పవార్ కోరారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాజ్యసభలో మద్దతు ప్రకటించిన ఎన్సీపీ.. స్థానిక సంస్థల్లో ఈ సంఖ్యను యాభై శాతానికి పెంచాలని డిమాండ్ చేసింది.

దీనిపై పార్టీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ... మహిళలకు యాభైశాతం సీట్లు కేటాయించాలని కోరారు. మహారాష్ట్రలోని స్థానిక సంస్థల్లో కేటాయించిన రిజర్వేషన్ల ఫలితంగా మహిళలు స్వపరిపాలనలో తమ సత్తాను చాటారని గుర్తు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్ పవార్ ఉన్న సమయంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించారు.

ఫలితంగా మహిళలు స్వపరిపాలనలో బాగా రాణిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితిలు, జిల్లా పరిషత్‌లలో సీట్లను 33 శాతం కేటాయించినట్టు గుర్తు చేశారు. ఈ సంఖ్యను యాభై శాతానికి పెంచాలని ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. తాజాగా, శరద్ పవార్ కూడా యాభై శాతానికి మద్దతు తెలుపడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి