తన వ్యాఖ్యలను సమర్థించుకున్న దిగ్విజయ్ సింగ్!!

సోమవారం, 13 డిశెంబరు 2010 (09:26 IST)
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ముంబై దాడుల్లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మరణించడంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు ఆయన నొక్కివక్కాణించారు. తన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీతో పాటు విశ్వహిందూ పరిషత్ నేతలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కర్కరేకు ప్రాణ హాని ఉందని ఆయన జీవించి ఉన్నసమయంలోనే నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షం హిందూ తీవ్రవాద వర్గాల కొమ్ముకాసిందంటూ విరుచుకుపడ్డారు.

ముఖ్యంగా, మాలేగావ్ పేలుళ్ళ తర్వాత ఈ పేలుళ్ళ కేసులో అరెస్టు చేసిన సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ను అరెస్టు చేయగానే ఆద్వానీ, రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఎందుకు సమావేశమయ్యారని ఆయన ప్రశ్నించారు. అనంతరం జైల్లో ఉన్న ప్రజ్ఞా సింగ్‌ను రాజ్‌నాథ్ ఎందుకు కలుసుకున్నారని నిలదీశారు. తమపై విమర్శలు చేసే ముందు పై ప్రశ్నలకు భాజపా నేతలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే, దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఇటువంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన రాజీనామ చేసేలా ఒత్తిడి తెస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ అన్నారు. మరోవైపు వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా దిగ్విజయ్‌ సింగ్‌ను పాకిస్థాన్ ఏజెంటుగా అభివర్ణించారు.

వెబ్దునియా పై చదవండి