తిరోముఖ మేధో వలస కాదు.. మేధో లబ్ధి : మన్మోహన్

FILE
గత కొన్ని సంవత్సరాలు విదేశాల్లోని భారతీయ మేధావులు స్వదేశాలకు తరలి వస్తున్నారనీ.. దీన్ని అందరూ తిరోముఖ మేధోవలస (రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్) అంటున్నారనీ, అయితే దీన్ని మేధో లబ్ధి అనడం సముచితం అని భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.

అమెరికా పర్యటన సందర్భంగా అక్కడి భారతీయులతో ఏర్పాటైన ఓ సమావేశంలో ప్రధాని పై విధంగా స్పందించారు. పర్యటన పూర్తి చేసుకుని స్వదేశం బయలుదేరిన మన్మోహన్ గౌరవార్థం అక్కడి భారత రాయబారి మీరా శంకర్ విందు ఇచ్చారు. ఈ విందుకు అమెరికాలోని భారతీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భారత్ అమెరికాల మధ్య స్నేహ వారధుల నిర్మాణంలో విశేష కృషి చేశారంటూ ఎన్నారైలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటంలో ఎకానమీ, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎంపవర్‌మెంట్ తదితర రంగాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.

ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా వివిధ దేశాల్లోని భారతీయ ప్రముఖులు స్వదేశానికి వచ్చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నామని మన్మోహన్ అన్నారు. అయితే దీన్ని అందరూ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ అంటున్నారనీ, తానయితే దీన్ని బ్రెయిన్ గెయిన్ అనో, మేధస్సుల భేటీ అనో అనడం సముచితమని అనుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగానే వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయులందరినీ స్వదేశానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానని మన్మోహన్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి