ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమారులతో మంగళగిరిలో తళుక్కున మెరిశారు. ఆయన శుక్రవారం ఉదయం పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్‌లతో కలిసి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు.
అనంతరం అధికారిక విధుల్లో నిమగ్నమయ్యారు. మంగళగిరిలో పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఆయన మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా, రూ.1290 కోట్ల వ్యయంతో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.