కుజుడు... మిథున లగ్నానికి చెందిన జాతకులకు 6, 11 స్థానాల్లో కుజుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. లగ్నంలో కుజుడుంటే జీవితంలో ప్రశాంతత నెలకొనటం కష్టతరమే. అంతేగాక ప్రతి కార్యానికి ఎదురీతతో ముందుకెళ్లాల్సియుంటుంది. జాతకులు సంగీతంలో ఆసక్తి కలిగినవారుగా ఉంటారు. అంతేగాకుండా ధైర్యవంతులుగా ఉంటారు. వివాదాలలో పాల్గొనటంలో నిపుణులు. ఈ జాతకులకు కుజుని ఆధిపత్యంతో అనేక సమస్యలు తటస్థిస్తాయి. విరోధుల వలన కొన్ని సమస్యలు తలెత్తటానికి ఆస్కారాలు ఎక్కువ.
కుజుడు ఎనిమిదో స్థానం నుంచి నీచ స్థానాన్ని పొందటంతో ఆయుస్సు దీర్ఘంగా ఉంటుంది. రెండో స్థానంలో నీచస్థానాన్ని పొందటంతో ఆదాయానికి ఆటంకాలు ఏర్పడతాయి. మూడోస్థానంలో ఆధిపత్యం వహించటంతో గురుదృష్టి ప్రభావంతో మంచి పలితాలు లభిస్తాయి. సమిష్టి వృత్తులను చేపట్టటం వంటివి ఆదాయాలను కల్పిస్తాయి.
గురు, కుజుడు సంయుక్తంగా ఐదో స్థానంలో ఉంటే స్వయం వృత్తుల్లో లాభం కలుగుతుంది. 11 స్థానంలో కుజుని ఆధిపత్యం, మార్గాధిపతిగా ఉండటంచేత, శుభస్థానాల్లో ఆధిక్యత వహిస్తే మంచి ఫలితాలు లభించటం కద్దు. మొత్తానికి కుజుడు 3, 6, 8, 10 స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
బుధుడు... మిథున లగ్నానికి చెందిన వారికి లగ్నాధిపతి బుధుడు శుభాధిపతి కావటంతో పాటు మరో సమయంలో కేంద్రాధిపత్య దోషంతో చెడు ఫలాలను కలిగిస్తాడు. బుధుడు లగ్నంలో ఆధిపత్యం వహిస్తే మంచి ఫలితాలను అందిస్తాడు. జీవితంలో మంచి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారు. వాక్చాతుర్యతతో అందరిని ఆకట్టుకుంటారు.
విజ్ఞానం, కళలు వంటి శాఖల్లో రాణిస్తారు. అయితే బుధుడు తమ దశకాల కారణంగా మంచి ఫలితాలను అందించటం కష్టం. నాల్గో స్థానంలో బుధుడుంటే శుభఫలితాలు లభించవు. పదో స్థానంలో ఆధిక్యం వహిస్తూ మీనరాశిలో నీచస్థానాన్ని పొందటంతో విద్యలో, జీవితంలో ప్రకాశవంతం లోపిస్తుంది. 3, 6, 8, 12 స్థానాల్లో ఆధిక్యం వహించే సమయంలో సుమారైన ఫలితాలను అందజేస్తాడు.
లగ్నాధిపతి.. సుఖాధిపతియైన బుధుడు రాశినుండి అదృశ్యమైతే జీవుతం విషమమైన పరిస్థితికి దిగజారుతుంది. ఇతడు కేంద్రాధిపత్య దోషంతో ఉంటే 4, 7, 10 వంటి లగ్న స్థానాలు కూడా మంచి యోగాలను కలిగించవు. బుధుడు మాత్రం ప్రత్యేకంగా ఆధిపత్యం వహించక సూర్య, కుజుడు, శని, రాహు, కేతులతో సంయుక్తంగా ఆధిక్యం వహిస్తే దోషం తొలగి మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇతర గ్రహాల దృష్టితోగానీ, ఇతర గ్రహాలతో చేరిగానీ ఆధిక్యం వహించటం ద్వారానే శుభప్రదమైన కార్యాలు జరుగుతాయి. శుభగ్రహాలతో సంయుక్తంగా బుధుడు చేరి 2, 5, 9, 11 స్థానాల్లో ఆధిపత్యం వహిస్తే సంతాన భాగ్యం, కుటుంబ వృద్ది, తండ్రి మార్గాన గల ఆస్తులు లభించే అవకాశాలున్నాయి.