బుధవారం (ఆగస్టు 25) మహా సంకష్ట హర చతుర్థి. ఈ రోజున వ్రతమాచరిస్తే కష్టాల నుండి గట్టెక్కవచ్చు. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండోది సంకష్టహర చతుర్థి.. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థిని వినాయక వ్రతంగా ఆచరిస్తారు.
సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ప్రతిమాసం కృష్ణ పక్షంలో.. అంటే పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి. అందులోనూ శ్రావాణ మాసంలో చతుర్ధి అంటే మరింత ప్రాముఖ్యం ఉంటుంది.
సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదువుతారు. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు.
సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ రోజున విఘ్నేశ్వరుని అరటి పండ్ల మాల, గరిక మాల, పసుపు పువ్వులతో చేసిన మాలను సమర్పించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.