ఆదాయం, ఖర్చుకు సంబంధించిన అంచనా జీతం అందుకునేందుకు ముందే చేతిలో ఉండాలి. నెలవారి చెల్లించాల్సిన వాటిని కాగితం మీద రాసుకోవాలి. ఇంటి అద్దె, పచారీ సామాన్లు, పిల్లల స్కూల్ ఫీజులు, బస్ పాస్‌లు, పని మనిషి జీతం వంటివన్నీ ప్రతినెలా తప్పనిసరిగా ఉండేవి.
కరెంట్, టెలిఫోన్ బిల్స్ వంటి వాటిని కలుపుకుని ఇంకా అదనంగా కొంత డబ్బు జత కలిపి నెలకు తప్పకుండా అవసరమయ్యే ఖర్చు ఎంతో లెక్క తేల్చాలి. ఆ లెక్క ప్రకారం మీ జీతంలో నుండి డబ్బును తీసి ఒక కవర్‌లో విడిగా పెట్టి ఉంచండి.
అనుకోని ఖర్చులు కొన్ని వస్తుంటాయి. ఆరోగ్యం కోసం, దుస్తుల కోసం, బంధుమిత్రులు వచ్చినప్పుడయ్యే ఖర్చువంటివన్నీ అదనపు ఖర్చులు. ఇలాంటి ఖర్చు నెలలో సరాసరిన ఎంతుంటుందో మీకు తెలిసే వుంటుంది. ఆ మేరకు డబ్బును తీసి మరో కవర్‌లో పెట్టండి.
కవర్లలో డబ్బు పెట్టి ఉంచడంతో పాటుగా దినవారి లెక్క తప్పదు. ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రోజు చేసిన ఖర్చును కాగితం మీద లేదా ఒక పుస్తకంలో రాసుకోవటం ద్వారా నెల చివరిలో ఖర్చు విషయంలో స్పష్టత ఏర్పడుతుంది. ఏ అంశం మీద ఎక్కువ ఖర్చు అవుతున్నది. ఎక్కడ దుబారా జరిగింది. ఏ అంశం మీద ఆదా చేయవచ్చు అనేది అంచనా వేసుకునేందుకు ఈ లెక్కలు పనికొస్తాయి. ఈ లెక్కలను బట్టి మరుసటి నెల బడ్జెట్‌లో మార్పులను చేసుకునేందుకు వీలుంటుంది.