ఎవరికైనా మనం సహాయం చేసేటపుడు ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. వారు ఎప్పుడైనా ఏమైనా మనకు సహాయం చేస్తాడని ఆశించకూడదు. సాధారణంగా ప్రతిఫలం ఆశించడం జరుగుతుంది. కనుక వాళ్లు ఎప్పుడైనా మనకు ఉపకారం చెయ్యకపోతే బాధ కలుగుతుంది. అపకారం చేస్తే సరేసరి. ఆ బాధ చెప్పలేం. అందుకని ఏది చేసినా తిరిగి అవతలివాడు ఏదైనా చెయ్యాలని కోరుకోకూడదు.
ఉదాహరణకు ఎవరికైనా డబ్బు సర్దవలసి వచ్చిందనుకోండి, అతడు ఇవ్వకపోయినా ఫర్వాలేదు అనుకుని మాత్రమే డబ్బు ఇవ్వాలి. అంటే అతడు మనకు డబ్బు ఇవ్వకపోయినా మనకు పెద్దగా నష్టం జరగకూడదు. అంటే మనం నష్టపోని విధంగా ఆ సహాయం చేయాలి. కానీ మనం ఇచ్చిన డబ్బు కారణంగా భారీ నష్టాన్ని చవిచూసినప్పుడు లబోదిబోమనుకున్నా ప్రయోజనం లేదు.
అందుకే డబ్బు ఇచ్చే ముందే ఇక దాన్ని మర్చిపోవాలి. అంతేకానీ, వాడికి డబ్బు సాయం చేసి ఇలా అయిపోయామేమిటా అని బాధపడకూడదు. ప్రతిఫలం ఆశించడం వల్ల అవతలివాడు చెయ్యకపోతే మొదట బాధ. తర్వాత కోపమూ వచ్చి అదే ద్వేషంగా కూడా మారవచ్చు. అంటే అవతలివాడికి ప్రతిఫలాపేక్షతో సహాయం చేయడం వల్ల వచ్చినదేమిటంటే, మనలో ఇతరుల పట్ల ద్వేషం పెరగడమన్నమాట. అందుకని ఆ పని చేసేముందే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలి.