ఆత్మఙ్ఞాన ప్రదానేన తస్మైశ్రీ గురవేనమః-భావం: అనేక జన్మల నుండి ప్రోగు చేసుకొనిన కర్మ బంధనాలన్నింటినీ నాశనం చేయు ఆయుధమైన ఆత్మఙ్ఞానం ప్రసాదించిన సద్గురుదేవునికి నమస్కరించుతున్నాను.
శోషణం భవసింధోశ్చ ఙ్ఞాపనం సార సంపదః
గురోః పాదోదకం సమ్యక్ తస్మైశ్రీ గురవేనమః
- భావం: దరిదాపు లేని భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్న నాకు తన చరణామృతాన్ని ప్రసాదించి తత్త్వసారాన్ని తెలియచెప్పి భవసాగరం నుండి రక్షించిన సద్గురుదేవునికి ప్రణామాలు.
నగురోరధికం తత్వం నగురోరధికం తపః
తత్త్వఙ్ఞానాత్ పరం నాస్తి తస్మైశ్రీ గురవేనమః- భావం: తత్త్వఙ్ఞానం లేకుండా పరమాత్మ ప్రాప్తి అసంభవం. ఆ తత్త్వఙ్ఞానం, తద్వారా చేయు తపస్సు కన్నా వాటిని ప్రసాదించు సద్గురువువే అధికమయినవాడు(శ్రేష్ఠుడు). తత్త్వఙ్ఞానం ప్రసాదించిన సద్గురువునకు నమస్కరించుతున్నాను.
మన్నాధ శ్రీజగన్నాధ మద్గురు శ్రీ జగద్గురుః
మదాత్మా సర్వ భూతాత్మ తస్మైశ్రీ గురవేనమః- భావం: నాలోని ఆత్మవై, సకల జీవుల ఆత్మయై, నాకు నాధుడవై, సకల జగత్తుకూ నాథుడవై జగద్గురువుగా విలసిల్లుతున్న సద్గురుదేవునికి నమస్కారములు.
గురోరాదిరనాదిశ్చ గురుః పరమదైవతం
గురోః పరతరం నాస్తి తస్మైశ్రీ గురవేనమః-భావం: ఆది-అంతమూ గురువే. గురువే పరమ దైవం. సద్గురువు కృపా-కటాక్షమూ లేకుండా పరమపద ప్రాప్తి అసంభవం. మోక్ష మార్గం సులభతరం చేసిన సద్గురువునకు నమస్కారములు.
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం ఙ్ఞాన మూర్తిం ద్వందాతీతం గగనసదృశం తత్త్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామిం
- భావం: నిత్యం శోకరహితుడై బ్రహ్మానందంలో లీనమై అఙ్ఞాన అంధకారానికి తావులేక ఙ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్న, ఆకాశసమానంగా(ఎల్లలు లేకుండా సకల ప్రదేశాలలో భాసిస్తూ) తత్త్వమసి ఆదిగా గల ఉపనిషద్వాక్యాలు లక్ష్యంగా గల (అనగా- సద్గురువు శిష్యులకి లౌకిక లక్ష్యాలు కాక కేవలం అలౌకిక లక్ష్యాలనే నిర్దేశిస్తారు) ఏకమై, నిత్యమై, విమలరూపుడై, సకల క్రియ, కర్మలకు సాక్షీభూతమైన, భావాలకి అతీతుడయిన, సత్వ, రజో, తమో గుణాలకి అతీతుడయిన సద్గురుదేవునికి వందనాలు.