తిరుమల శ్రీవారి ఆలయంలో నవనీత హారతి...! టిటిడి ఆధీనంలోకి శ్రీవారి ఆలయం ఎప్పుడెళ్ళిందో తెలుసా?
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (18:23 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో నేటికీ ప్రతిరోజు సుప్రభాత సమయంలో శ్రీ స్వామివారికి గోక్షీర నివేదన, నవనీత హారతి జరుగుతాయి. ఇది మహంతు బావాజీ పేరుతోనే మహంతు మఠంవారు పంపిస్తూ ఉండగా నేటికీ జరగడం విశేషం. అదెలాగంటే.. ప్రతిరోజు తెల్లవారుజామున తిరుమల మహంతు మఠంలోని ఒక సాధువు స్నాన సంధ్యాదులు ముగించుకుని ద్వాదశ నామాలను ధరించి భక్తిగా గోవిందనామస్మరణ చేస్తూ అప్పుడే పితికిన ఆవు పాలను, అప్పుడే తీసిన వెన్న కలిగిన గిన్నెను పచ్చకర్పూర తాంబూలాన్నీ వీటిని అన్నింటికి ఒక పళ్ళెంలో ఉంచుకుని వాటిపై ఒక పట్టు వస్త్రాన్ని కప్పి ఉంచి శ్రీవారి ఆలయానికి సుప్రభాతవేళకు కౌసల్యా సుప్రజారామ..అని ప్రారంభించిన వెంటనే సన్నిధి గొల్ల, అర్చకులతో పాటు ఏకాంగి బంగారు వాకిలి లోపల ప్రవేశిస్తూ మహంతు మఠం నుంచి తేబడిన పళ్ళాన్ని తీసుకొని వెళతాడు.
లోపల అర్చక స్వాములు, శ్రీ స్వామివారికి మహంతు మఠం నుంచి వచ్చిన ఆవుపాలను నివేదించి తాంబూలాన్ని సమర్పించి నవనీత హారతిని ఇస్తారు. సుప్రభాతమంతా పూర్తి అయిన తరువాత వరుసగా తాళ్లపాకం, తరిగొండవారితో పాటు మహంతు మఠం వారికి తీర్థ చందన, శఠారి మర్యాదలు జరుగుతాయి.
ఇలా ప్రతిరోజు తెల్లవారుజామున తొలిగా జరిగే ఉగాది, శ్రీరామనవమి, ఆణివార ఆస్థానం, దీపావళి వంటి ఆస్థానాల్లో, బ్రహ్మోత్సవంలో రథోత్సవం నాడు సైతం మహంతు వారి తరపున శ్రీ స్వామివారు హారతులందుకొని ఆ భక్తుని పేరిట వచ్చిన సాధువులకు శఠారి మర్యాదలు జరుపుతూనే ఉన్నారు.
ఇక ప్రతి సంవత్సరం తిరుమల స్వామివారికి జరిగే పారువేట ఉత్సవం నాడు, పారువేటకు వెళ్ళి వచ్చిన తరువాత ఆలయం చుట్టూ పురవీధుల్లో మహంతు మఠం వారి ఉభయంగా శ్రీ స్వామివారి వూరేగింపు సాగుతుంది. మహంతు తరపున వచ్చిన వారికి చివరలో హారతి శఠారి మర్యాదలు జరుగుతున్నాయి. తిరుమలలో పాపవినాశనం వెళ్ళే దారిలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయాన్ని ఆ పక్కనే శ్రీ స్వామి హథీరాంజీ బావాజీ వారి సజీవ సమాధిని దర్సించవచ్చు. నేటికీ అక్కడికి వెళ్ళిన భక్తులకు, బావాజీ స్వీకరించిన రామపత్రం అనే ఆకును ప్రసాదంగా ఇస్తారు. ఇది కొద్దిగా తీపిగా ఉంటుంది. ఇక్కడ ఉన్న శ్రీ స్వామి హథీరాంజీ బావాజీ వారి సమాధి, వేణుగోపాల స్వామి ఆలయం మహంతు మఠం వారి ఆధీనంలో ఉన్న ఇక్కడ నిత్యమూ పూజలు జరుపబడుతూనే ఉంటాయి.
శ్రీ స్వామి హథీరాంజీ మఠం బావాజీ వారి మఠం శాఖలు తిరుమల, తిరుపతిలోనే కాక తిరుచానూరు, చిత్తూరు, వేలూరు, షోలింగర్, వృద్థాచలం, తంజావూరు, మధుర, నాసిక్, పంచవటి, సుగూరు, బొంబాయి, భాగల్ కోట, గుజరాత్, అయోధ్య, నాభా తదితర ప్రాంతాల్లో విస్తరిల్లి ఉన్నాయి. తిరుమల, తిరుపతిలోని మహంతు మఠాల్లో కూడా శ్రీ రామాలయాలు హనుమదాలయాలు ఉన్నాయి. వీటితో పాటు వందలాది సాలగ్రామాలను చూడవచ్చు. ఈ మఠాల్లో నేటికీ విశేష దినాల్లో ఉత్తర భారతం నుంచి వచ్చిన సాధువులకు బైరాగులకు అన్నదానం చేయబడుతున్నది. ముఖ్యంగా బంజారీలు, సుగాలీలు ఉత్తర దేశీయులైన అనేకులు హథీరాంజీ మఠంలో దిగటం, మహంతును దర్సించటం ఆ తరువాతనే శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్సించడం సంప్రదాయంగా ఆ నాటి నుంచి కొనసాగుతూ ఉంది.
ఇది ఇలా ఉంటే ఆంగ్లేయులకు పూర్వం తిరుమల, తిరుపతి ఆలయాలు, విజయనగరం, చంద్రగిరి, కార్వేటినగరం మున్నగు చక్రవర్తుల పాలనలో ఉండేవి. ఆంగ్లేయుల పాలన స్థిరపడ్డాక ఈస్టిండియా కంపెనీ వారు, మద్రాసు రాష్ట్ర రెవిన్యూ బోర్డు ఆధ్వర్యంలో ఉత్తరార్కాటు జిల్లా కలెక్టరు (1817 నాటి ఏడవ మద్రాసు శాసనాన్ని అనుసరించి) తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని నిర్వహించేవారు.
ఇంతలో భారతదేశ మత విశ్వాసాల్లో, దేవాలయాల్లో, ధర్మసంస్థల్లో ఎలాంటి జోక్యం కలుగజేసుకోగూడదన్న చట్టాన్ని అప్పటి ఆంగ్ల ప్రభుత్వం అమలు పరిచింది. దీని ప్రకారం అప్పటి కలెక్టరు ఈ తిరుమలలోని ఆలయ నిర్వహణను చేపట్టవలసిందిగా మైసూరు మహారాజా వారిని, వెంకటగరి సంస్థానాధీశుని అభ్యర్థించాడు. కానీ వారు తమ సంస్థాన నిర్వహణల్లో మునిగి ఉన్నందు వల్ల తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిర్వహించలేమన్న అభిప్రాయంతో నిరాకరించారు. కానీ భగవద్రామానుజుల కాలం నుండీ అప్పటివరకు ఆనాటి వరకు తిరుమల, తిరుపతి ఆలయ పూజల్లో ప్రధాన పాత్రను నిర్వహిస్తూ ఉన్న శ్రీ వైష్ణవ పీఠాధిపతులు, పెద్దజియ్యంగార్, చిన్న జియ్యంగార్లపై ఆలయాల నిర్వహణను, పరిపాలించే అధికారాన్ని తమకు అప్పజెప్పవలసిందిగా కలెక్టర్‌ను అప్పట్లో కోరారు.
కానీ జియ్యంగార్లు ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు నిత్యమూ జరిగే అనేక నిత్యోత్సవాల్లోను, వారోత్సవాల్లోను, మాసోత్సవాల్లోను, వార్షికోత్సవాల్లోను ప్రధాన పాత్ర వహిస్తూ పర్యవేక్షిస్తూ ఉన్నందువల్లనూ పైగా అన్ని పూజల్లోను వారి ప్రత్యక్ష పాత్ర సంప్రదాయంగా నడుస్తున్నందు వల్ల, అటు పూజలతో పాటు, ఇటు పరిపాలన సాగించలేరనే అభిప్రాయంతో వారి కోరిక తిరస్కరించబడింది. అంతే కాకుండా వైష్ణవులైన జియ్యంగార్లలో వడగల, తెంగల అనే తెగులు ఉండి తమలో తాము కలహిస్తున్నందు వల్లనూ కూడా తిరుమల ఆలయ పాలన వారికి దఖలు పరచబడకుండా వారి అభ్యర్థన తోసి పుచ్చబడింది.
అప్పటికే తిరుమల, తిరుపతిలోనే గాక ఇంకా దేశమంతటా పలుచోట్ల మంచి స్థిరాచరాస్థులు కలిగి ఉండడమే కాకుండా మీదు మిక్కిలి తిరుమల యాత్రికులకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక ధర్మపీఠంగా ఒక జన సేవా సంస్థగా పేరొందిన మఠంలోని మహంతులు, వైష్ణవ మతప్రచారకులే అయినందున పై పెచ్చు ఈ మహంతుల్లో వడగల, తెంగల వంటి భేదాలు ఏవీ లేనందువల్ల అటు ఉత్తర దేశీయులకు, ఇటు దక్షిన దేశీయులకు సమన్వయాన్ని సాధించి సేవలందిస్తూ ఉన్నందు వల్ల క్రీస్తు శకం 1843 ఏప్రిల్ 21వతేదీన అప్పటి కలెక్టర్ సనద్ నివేదిక ప్రకారం తిరుమలలోని మహంతుకు వారి తదనంతర మఠాధిపతులకు తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.