మధ్వ నవిమి రోజున శ్రీరాముడు, ఈశ్వరుల పూజ చేయడం సర్వశుభాలను ఇస్తుంది. ఇంకా గురుపూజకు ఈ రోజు విశిష్టత చేయడం మంచిది. అలాగే రామభక్తుడైన హనుమంతుడిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే ద్వైత మత బోధకులు మధ్వాచార్యులు. మధ్వ నవమి రోజున ఆయనను స్తుతించడం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధి చేకూరుతుంది. గురు అనుగ్రహం లభిస్తుంది.
త్రిమతాచార్యులలో మూడవ వారై, హనుమంతుడు, భీముడు, అనంతరం వాయుదేవునకు తృతీయ అవతారంగా భావించే మధ్వాచార్యులు ద్వైత మత బోధకులు. క్రీ.శ.1238 ఆశ్వయుజ మాస శుక్ల పక్ష దశమి (విజ యదశమి) నాడు ఆయన కొంకణ - కేరళ మధ్యనున్న కనరా మండలంలోని ఉడిపి పట్టణ సమీపస్థ పాజక క్షేత్రంలో మధ్య గేహభట్ట, వేదవతి దంపతులకు జన్మించారు.
ఉడిపిలోని అనంతేశ్వర స్వామిని చిరకాలం కొలిచిన ఫలితంగా శమున జన్మించినందున ఆయనకు వాసుదేవుడని తల్లిదండ్రులు పేరు పెట్టారు. అనంతర కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్యాచార్య అనే నామాలతో ప్రసిద్ధులైనారు. యుక్త వయసులోనే దక్షిణ భారతావనిలో కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం తదితర క్షేత్రాలను సందర్శించారు. తాను పొందిన తత్వజ్ఞానాన్ని ఉపన్యాస రూపంలో ప్రజలకు వివరించారు.
ఉడిపిలో భగవద్గీత, ఉపనిషత్తులకు భాష్యాలు రాసారు. రుగ్వేదంలోని 40 సూక్తాలకు, భారత భాగవతాలకు వ్యాఖ్యానాలు రచించారు. శ్రీకృష్ణామ్యత మహార్షవం కర్మనిర్ణయం, మహా భారత తాత్పర్యంలాంటి అనేక గ్రంథ రచనలు గావించారు. తర్కంతో పాటు 37 గ్రంథాలను విరచించారు. మధ్వాచార్య ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి, ద్వైతమత విస్తృత ప్రచారం గావించి, వైష్ణవ మత వ్యాప్తికి, ప్రధానంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ద్వారా ఇతోధికంగా కృషి సల్పారు.
భీమసేనుని అవతారమని భావించే ఆయన వృకోదరత్వాన్ని పలుమార్లు ప్రదర్శించి, విష్ణు మంగళ గ్రామాన 200 అరటి పళ్ళను ఆరగింప ప్రార్ధితుడై అలవోకగా తినివేశారు. ఇషుపాతమనే మరో గ్రామంలో 1000 అరటి పళ్ళు తెచ్చిఇవ్వగా, అన్నింటినీ ఒకే ఊపులో ఆరగించారు. అడవి మార్గాన సంచరిస్తుండగా, పొదలనుండి వచ్చి, శిష్యుని మీద దూకిన పులిని ఒకే గుద్దుతో హతమార్చారు.
కడూరా మండలంలోని ముద్ర గ్రామ సమీప తుంగభద్రా నదీ తీరాన అంబుతీర్ధమనే ప్రదేశాన ఒడ్డునుండి నదిలోనికి అడ్డంగా పడి ఉన్న పెద్ద బండరాయిని చూసి, విషయం కనుగొని, అవలీలగా ఒక్క చేతితో ఎత్తి అనుకున్న స్థలంలో అనువుపరిచారు. ఆయన అతిలోక బల సామర్థ్యానికి నిదర్శనంగా, ఆ బండ మీద (శ్రీ మధ్వాచార్వైరేక హస్తేన ఆనీయ స్థాపిత శిలా" అనే అక్షరాలు చెక్కబడినవై ఉన్నాయి.
తమ 79వ ఏట క్రీ.శ.1817లో మాఘశుక్ల నవమి నాడు శిష్య సమేతులై బదరీ నారాయణుని దర్శించి, ఉత్తర బదిరిని ఒంటరిగా చేరి, వ్యాస భగవానుని కైంకర్యాలలో నిమగ్నమైనారు. మాఘశుక్ల నవమి రోజున మధ్వాచార్యుల వారిని స్తుతించి నేతి దీపం వెలిగించి పూజించాలి.
Madhva Navami
ఇంకా ఆలయాల్లో దీపారాధన చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మాఘ శుక్ల పక్షంలోని తొమ్మిదో రోజు అంటే నవమి రోజు భారతదేశం అంతటా ముఖ్యంగా మఠాలలో శ్రీ మధ్వాచార్యుల తత్వ వాదానికి విధేయత చూపుతూ ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజున ఆయన అదృశ్యమైన రోజుగా భావిస్తారు. ఈ పుణ్య తిథిని పవిత్ర స్మారక దినంగా పాటిస్తారు.