మహాభారత కురుక్షేత్ర యుద్ధం ద్రౌపదికి జరిగిన అవమానంతో ఏర్పడింది. ఇరువైపులా రాయబారాలు విఫలమవడంతో కౌరవులు, పాండవులు యుద్ధానికి సిద్ధమవుతారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహావీరులతో దుర్యోధనుడు యుద్ధానికి సంసిద్ధుడవుతాడు. ఈ యుద్ధం ధర్మ సంస్థాపన కోసం జరిగింది. కానీ ఈ యుద్ధానికి కారణమైన శకుని సహదేవుని చేతులతో వధించబడతాడు. మహాసంగ్రామములో సహదేవుడు శకునికి ఎదురౌతాడు.
శకుని కుతంత్రుడే కానీ కువీరుడు కాదు. అతడు సహదేవుడితో తలపడి పది బాణములు అతడి శరీరంలో గ్రుచ్చుతాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లగా అది చూసి భీముడు శకుని ముందున్న గాంధార సైన్యమును సర్వ నాశనం చేసేస్తాడు. అది చూసి కౌరవసేనలు పారిపోగా సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పుతాడు. సహదేవుడు మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద పది బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండిస్తాడు.
శకుని వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపిస్తాడు. శకుని కుమారుడైన ఉలూకుడు.. సహదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించగా సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండిస్తాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద మూడు బాణములు వేయగా సహదేవుడు ఆ మూడు బాణములను ఖండించి శకుని విల్లు విరిచి వేస్తాడు.
శకుని మహా కోపంతో సహదేవునిపై కత్తిని, గధను, బల్లెమును ప్రయోగించాడు. సహదేవుడు వాటిని మధ్యలోనే ఖండించగా అది చూసి శకుని తన రధ రక్షకులతో సహా అక్కడి నుండి పారిపోతాడు. సహదేవుడు అతడిని నిలువరించి "ఓ గాంధార రాజా ! రాజ ధర్మం విడిచి ఇలా పారిపోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు. నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా సర్వనాశనం అయింది.