అంబాజీ- గుజరాత్‌లోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతూ 'అంబా భవానీ'గా పిలవబడుతున్న దివ్య క్షేత్రం. అతి పురాతనమైన ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఎటువంటి దేవతామూర్తి కనిపించదు. దేవతామూర్తి పీఠం అక్కడ ఉంది. వస్త్రాలు మరియు ఆభరణాలు అలంకరించిన తీరు అక్కడ దేవతామూర్తి కొలువుదీరిన భ్రమకు లోను చేస్తుంది. 'జయ అంబే' అంటూ భక్తులు సాగించే నామ సంకీర్తనతో అక్కడి వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని ఉంటుంది.
ఈ అమ్మవారి కరుణాకటాక్షవీక్షణలతోనే రుక్మిణి, శ్రీకృష్ణుని భర్తగా పొందింది. ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు తలనీలాలు సమర్పించుకున్నాడని భక్తుల విశ్వాసం. అంబాజీ పట్టణంలో ప్రతి పౌర్ణమికి పెద్ద సంఖ్యలో చేరే భక్తులు 'లోక్ మేలా' పేరిట ఆధ్యాత్మిక ఉత్సవాన్ని జరుపుకోవడం ద్వారా అంబాజీ మాతను భక్తి ప్రపత్తులతో సేవించుకుంటారు.
విశ్వవిఖ్యాతి చెందిన రాజులు, సాధుజన గాయకులు అమ్మవారి పాదాల చెంత తమను తాము సమర్పించుకున్న పవిత్రమైన ఈ పుణ్య క్షేత్రం ప్రతి వర్ణానికి, సంతతికి చెందిన సాక్తేయులు మరియు భక్తులు తప్పనిసరిగా దర్శించవలసిన దివ్యధామంగా వాసికెక్కింది. విశ్వానికి అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తికి
WD Photo
WD
మూలమైన అంబాజీ దేశంలోని అతి పురాతనమైన 51 శక్తి పీఠాలలో ఒకటి.
ఉజ్జయినీలోని భగవతి మహాకాళి మహాశక్తి, కాంచీపురంలోని కామాక్షి అమ్మవారు, మల్యగిరిలో వెలసిన భ్రమరాంబ, కన్యాకుమారిలోని కుమరిక, గుజరాత్‌లోగల అనర్ట్‌లోని అంబాజీ, కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి, ప్రయాగలోని లలితాదేవి, వింధ్యలోని వింధ్యవాసిని, వారణాసిలోని విశాలాక్షి, గయలోని మంగళవతి, బెంగాల్‌లోని సుందరీ భవానీ మరియు నేపాల్‌లోని గుహ్యకేసరిలు శక్తిని సేవించే 12 ప్రధానమైన శక్తి పీఠాలుగా వినుతికెక్కాయి.
WD Photo
WD
పాలన్‌పూర్‌కు 65 కి.మీ.ల దూరంలో, అలాగే మౌంట్ అబూకు 45 కి.మీ.ల దూరంలో గల గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దు సమీపంలో అంబాజీ ఆధ్యాత్మిక పట్టణం నెలవై ఉన్నది. ప్రతి సంవత్సరం గుజరాత్ మరియు పొరుగున ఉన్న రాజస్థాన్ నుంచి లక్షల సంఖ్యలో భక్తులను ఆకర్షించే గుజరాత్‌లోని పవిత్రమైన దేవాలయాలలో ఒకటైన అంబాజీ మాత దేవాలయానికి ఈ పట్టణం ప్రసిద్ధి చెందినది.
అంబాజీ మాత యొక్క నిజ పీఠం అంబాజీ పట్టణానికి మూడు కి.మీ.ల దూరంలో గల గబ్బర్ పర్వత శిఖరంపై ఉన్నది. గౌరీ మాత హృదయంగా చెప్పబడుతున్న అంబాజీ మాత దేవాలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా భక్తుల పూజలను అందుకుంటున్నది. గబ్బర్‌లోని అంబాజీ మాత దేవాలయం అత్యంత పురాతనమైనది. ఆర్యులు తమ దేవగణంలోని దేవతగా ఆరాధించే అంబామాత తొట్టతొలి ఆర్య వంశం ఆరాధించే దేవతలలో ఒక దేవతగా పూజలందుకున్నది.
గబ్బర్ పర్వతంపై అమ్మవారి పాదముద్రలు ముద్రితమై ఉంటాయి. ముద్రితమైన అమ్మవారి రథం కూడా ఇక్కడ కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు తన తలనీలాలను సమర్పించుకునే ఉత్సవం ఇక్కడ జరగిందని భక్తుల విశ్వాసం. ఆరావళి పర్వత సానువుల్లోని అరసూర్ పర్వతంపైన కొలువైన అంబాజీ దేవాలయంలో ఎటువంటి
WD Photo
WD
దేవతా మూర్తి విగ్రహం కనిపించదు.
సముచిత స్థానంలో ప్రతిష్ఠించబడిన ఒక స్వర్ణయంత్రం మాత్రం ఈ దేవాలయంలో కనిపిస్తుంది. యంత్రంపై 51 శ్లోకాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే పూర్ణిమ నాడు జరిగే ఉత్సవాల్లో పాలుపంచుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని చేరుకుంటారు. వేల సంవత్సరాలుగా అంబాజీ మాత తన భక్తుల కోరికలను తీరుస్తున్నది.
ప్రత్యేక ఆకర్షణలు- నవరాత్రిని పురస్కరించుకుని వచ్చే తొమ్మిది రోజుల్లో, దేవాలయపు ముందు భాగంలో పూజలు మరియు నృత్యాలు చోటు చేసుకుంటాయి. ఈ పండుగను పురస్కరించుకుని గుజరాత్‌లోని రైతులందరూ తమ కుటుంబసమేతంగా దేవాలయానికి విచ్చేస్తారు. సాయం సమయాన జరిగే భారీ ఉత్సవంలో, భావై ప్రదర్శనలతో పాటు గర్బ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అమ్మవారిని స్తుతించేందుకు ఉద్దేశించిన 700 పద్యాలతో కూడిన సప్తశతిని భక్తులు సామూహికంగా పఠిస్తారు.
భాద్రపద పౌర్ణమి నాడు ఇక్కడకు విచ్చేసే భక్తులు రెండు మైళ్ళ దూరంలోగల గబ్బర్‌గథ్ పేరుతో పిలవబడే చిన్న పర్వతాన్ని సందర్శించడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ప్రకృతి పట్ల తమకు గల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ పర్వతంపైన గల రావిచెట్టుకు భక్తులు ప్రదక్షిణ చేస్తుంటారు. గుజరాత్ సాంప్రదాయ రీతిలో పుష్పాలంకృతురాలైన దేవతామూర్తికి భక్తులు శిరస్సు వహించి నమస్కరిస్తుంటారు.
WD Photo
WD
ప్రతి మాసం పౌర్ణమి మరియు చంద్రుడు కొత్తగా సాక్షాత్కరించే అష్టమి రోజుల్లోను పలు రకాలైన ప్రత్యేక పూజలను అమ్మవారికి చేస్తారు. కనుక, ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేకమైనదే, అంతేకాక ఈ పవిత్రధామంలో ప్రతి క్షణం పరమపవిత్రమైనదై ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లుతున్న వైనం చూసి తరలించవలసిందే కానీ మాటలలో వర్ణించడం కవులకైనా అసాధ్యమే.
అహ్మదాబాద్ నుంచి - 180 కి.మీ.లు అబూ రోడ్ స్టేషన్ నుంచి - 20 కి.మీ.లు మౌంట్ అబూ నుంచి - 45 కి.మీ.లు న్యూఢిల్లీ నుంచి - 700 కి.మీ.లు దగ్గరలోని స్టేషన్ - అబూ రోడ్ దగ్గరలోని విమానాశ్రయం - అహ్మదాబాద్