తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే లష్కర్ బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంతో పాటు వివిధ ప్రాంతావల్లోని మరో 35 ఆలయాల్లో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బోనాల సంబరాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదివారం అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ బోనాల వేడుకల్లో ప్రత్యేకంగా అలంకరించిన బండ్లలో అమ్మవారి ఫోటోలు, విగ్రహాలతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోతు రాజుల విన్యాసాలు, భక్తుల నృత్యాలు, బలికోసం తెచ్చిన మేకపోతులు, పొట్టేళ్లతో మహంకాళి ఆలయ ప్రాంగణం కోలాహలంగా దర్శనమిచ్చింది.
బోనాల్లో భాగంగా సోమవారం ఉదయం రంగం జరిగింది. అందులో భవిష్యవాణి వినిపించారు. ఆదివారం జరిగిన బోనాల వేడుకల్లో మెగాస్టార్ సోదరుడు నాగబాబు, తెదేపా నేతలు, మంత్రులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.