ప్రస్తుతం స్వామివారికి సమర్పించే నైవేధ్యానికి ఆర్గానికి పదార్థాలను వినియోగిస్తుండగా భవిష్యత్తులో భక్తులకు అందించే ప్రసాదాలు కూడా ఈ పదార్థాలనే వినియోగించనుంది టిటిడి. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుడు ఎంతటి భక్తజన ప్రియుడో అంతటి నైవేద్యప్రియుడు. అందుకే శ్రీవారికి ప్రతిరోజు ఆరు సమయాల్లో నైవేద్యాన్ని సమర్పిస్తారు. వేకువజామున సుప్రభావం మొదలుకుని రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది.
మరే ఆలయంలోను ఇన్ని రకాల ప్రసాదాలు సమర్పించరు. లడ్డు, వడ, అప్పం, దోస, పోలి, చుక్కీలు, పాయసం, మురుకు, జిలేబి, ఇలా ఎన్నో రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. పూర్వం స్వామివారికి గోవు ఆధారిత పండించిన పదార్థాలతో నైవేధ్యం సమర్పించేవారు. కాలం క్రమేణా వ్యవసాయ పద్ధతులు మారుతూ వస్తుండడంతో నైవేద్యంలో వినియోగించే పదార్థాలు కూడా మారాయి.
గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాల లభ్యత తక్కువగా ఉండడంతో టిటిడి కూడా ఎరువులతో పండించిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించింది. పూర్తిస్థాయిలో వాటినే వినియోగించడం మొదలుపెట్టింది. స్వామివారికి రామానుజస్వామివారు నిర్ధేశించిన విధంగానే నైవేధ్యం సమర్పణ జరుగుతున్నా గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్ధాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేశారు మాజీ పాలకమండలి సభ్యులు శివకుమార్.
దాతలు కూడా టిటిడి గోవు ఆధారిత పంటతో పండించిన పదార్థాలను విరాళాలుగా అందిస్తున్నారు. కోటి రూపాయలు విలువచేసే 26రకాల పదార్ధాలను దేశవ్యాప్తంగా సేకరించి టిటిడికి అందజేశారు చిన్నజియ్యర్ స్వామి, మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు. స్వామివారికి ఆరునెలల పాటు నైవేధ్యం సమర్పించే వస్తువులను అందజేశారు.