ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడి మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై టిటిడి నిర్వహిస్తున్న మంత్ర పారాయణం ఫిబ్రవరి 3వ తేదీ బుధవారం నాటికి 300 రోజులు పూర్తి చేసుకుంటుంది. విశ్వవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుండి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
ఇందులో భాగంగా మార్చి 16 నుండి 25వ తేదీ వరకు శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞం, మార్చి 26 నుండి 28వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం నాదనీరాజనం వేదికపై "యోగవాశిస్టం - శ్రీ ధన్వంతరి మహామంత్రం" పారాయణాన్ని ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వరకు 62 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత జూన్ 11వ తేదీ ప్రారంభమైన సుందరకాండ పారాయణం ఫిబ్రవరి 3వ తేదీకి 238 రోజులు పూర్తి చేసుకోనుంది.
అదేవిధంగా జూలై 15న విరాటపర్వం - లోక కల్యాణ పారాయణం, సెప్టెంబరు 10వ తేదీ నుండి గీతా పారాయణం నిర్వహిస్తున్నారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీ విభీషణ శర్మ ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు సుందరకాండను పారాయణం చేస్తున్నారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు వేదపారాయణందార్ శ్రీ కాశీపతి భగవద్గీత పారాయణం చేయగా, వేదపండితుడు శ్రీ కుప్పా విశ్వనాథశాస్త్రి వ్యాఖ్యానం చేస్తున్నారు.
రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వేదధ్యాపకులు శ్రీ పవన్‌కుమార్ శర్మ, శ్రీమారుతి విరాటపర్వంలోని శ్లోకాలను పఠిస్తున్నారు. ఈ పరాయణ కార్యక్రమంలో పండితులు శ్లోకాలను భక్తులతో పలికించి అర్థ తాత్పర్యాలతో పాటు ఆ శ్లోక ఉచ్చరణ వలన కలిగే ఫలితం, నేటి ఆధునిక సమాజంలోని మానవాళికి ఏవిధమైన సందేశం ఇస్తుందో వివరిస్తూ నిరంతరాయంగా పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.