పాన్ పసిఫిక్ ఓపెన్ : జంకోవిచ్ ఇంటిముఖం

శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (16:20 IST)
టోక్యో వేదికగా జరుగుతోన్న పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలో దిగిన సెర్బియా క్రీడాకారిణి జెలీనా జంకోవిచ్ క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. రష్యా క్రీడాకారిణి స్వెత్లానా కుజ్నెత్సోవా చేతిలో ఓడిపోవడం ద్వారా జంకోవిచ్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.

ప్రస్తుతం ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణిగా కొనసాగుతోన్న జంకోవిచ్ ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో కుజ్నెత్సోవా ధాటికి తలవంచక తప్పలేదు. క్వార్టర్ పోరును విశ్వాసంతో ప్రారంభించిన జంకోవిచ్ ప్రారంభంలో ధాటిగానే ఆడింది. దీంతో 6-2 తేడాతో తొలిసెట్ జంకోవిచ్ సొంతమైంది.

అయితే రెండో సెట్‌నుంచి కుజ్నెత్సోవా ఒక్కసారిగా జంకోవిచ్‌పై విరుచుకుపడింది. హోరాహోరీగా సాగిన రెండు సెట్లలోనూ 7-5, 7-5 తేడాతో కుజ్నెత్సోవా విజయం సాధించింది. తాజా విజయంతో కుజ్నెత్సోవా సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

కొద్దిరోజుల క్రితం జరిగిన అమెరికా ఓపెన్‌లో సైతం ఫైనల్‌కు చేరుకున్న జంకోవిచ్ అక్కడ మాత్రం పూర్తి స్థాయి సత్తాను ప్రదర్శించలేక పోయింది. ఫైనల్ పోరులో అమెరికా క్రీడాకారిణి సెరీనా విలియమ్స్‌తో తలపడిన జంకోవిచ్ ఓటమి చవిచూసింది.

వెబ్దునియా పై చదవండి