కుంగుబాటును భరించలేక 32వ అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య!

ఠాగూర్

సోమవారం, 12 మే 2025 (10:02 IST)
గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతూ వచ్చిన టెక్కీ ఒకరు తాను ఉంటున్న బహుళ అంతస్తుల భవనంలోని 32వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పోలీసుల కథనం మేరకు.. ఢిల్లీకి చెందిన అమన్ జైన్ (32) తన భార్యతో కలిసి కోకాపేటలోని మైహోం తర్షయ అపార్టుమెంట్‌లోని ఒకటో టవర్‌లో నివాసం ఉంటున్నారు. అమన్ జైన్, ఆయన భార్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్ రంగంలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. అమన్ జైన్ కొంతకాలంగా తీవ్రమైన కుంగుబాటుతో బాధపడుతున్నాడని, దానికి సంబంధించి చికిత్స కూడా పొందుతున్నాడని తెలిసింది.
 
శనివారం ఉదయం కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్న సమయంలో అమన్ జైన్ తాను నివాసముంటున్న ఒకటో టవర్‌లోని 32వ అంతస్తు పైకివెళ్లాడు. అక్కడి నుంచి అకస్మాత్తుగా కిందకు దూకాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి వెల్లడించారు. ఆత్మహత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలు, కుంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలపై లోతుగా విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు