ఉప ఎన్నికకు ముందు ఇలా వరాలు కురిపించడం కేసీఆర్‌కు అలవాటు : ఈటల
బుధవారం, 9 జూన్ 2021 (13:47 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ నుంచి తప్పుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నిక వస్తుందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటిస్తారని ఆరోపించారు. 'అధికారంలో ఉన్ననాడు అధికారంలో లేని నాడు ప్రతి సమయంలో నేను ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుని వారి మెప్పుపొందిన బిడ్డగా ఉన్నాను' అని ఈటల అన్నారు.
ఆయన బుధవారం మాట్లాడుతూ, తెరాసకు రాజీనామా చేసి వచ్చిన తర్వాత ప్రజలందరూ నాతో చెబుతున్నారు. భర్త చనిపోతే భార్యకు పింఛను రావాలని రావట్లేదని అన్నారు. పింఛన్లు ఆగిపోయాయి అని చెప్పారు. రెండున్నరేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదని తెలిపారు. రాజీనామా తర్వాత ప్రజలు అనేక సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు' అని ఈటల చెప్పారు.
'ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను హుజూరాబాద్ నియోజక వర్గంలో తెల్ల రేషన్ కార్డులు, పింఛన్లను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా 58 ఏళ్లు నిండిన అందరికీ పింఛన్లు ఇవ్వాలి. 2018 ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇవ్వండి. హుజూరాబాద్‌లో మీకు ఓట్లు కావాలి కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగ భృతి ఇవ్వాలి' అని ఈటల డిమాండ్ చేశారు.
'మన ముఖ్యమంత్రికి ఒక అలవాటు ఉంది. ఎప్పుడు ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా ఆ నిజయోక వర్గాల్లో వరాల జల్లు కురిపించే అలవాటు ఉంది. కాబట్టి ఈ నియోజక వర్గంలో కూడా మూలనపడిన పనులు జరిగేలా నిధులు విడుదల చేయాలని నేను కోరుతున్నాను' అని ఈటల చెప్పారు.
'మళ్లీ నేను చెబుతున్నాను గొర్రెల మంద మీద తొడేళ్లు పడ్డట్లు తెరాస ప్రవర్తిస్తోంది. ఎన్నడు కూడా హుజూరాబాద్‌కు సాయం చేయలేదు. ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుందని చాలా మంది ప్రభుత్వ పెద్దలు ఇక్కడికి వస్తున్నారు. 18 ఏళ్లుగా నన్ను ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులుగా బతికిన మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు' అని ఈటల చెప్పారు.
అదేసమయంలో తాను పార్టీ పెట్టలేదు.. పార్టీ మారలేదని ఈటల అన్నారు. ఆ పార్టీ నుంచి బయటకు మాత్రం వచ్చాను. 'ఎవరో అనామకుడు ఇచ్చిన ఫిర్యాదు వల్ల నాపై వేటు వేశారు. తప్పుకుండా మీరు తొవ్విన బొందలో మీరే పడతారు. నేను ఎన్నడూ డబ్బలు ఇచ్చి గెలవలేదు. మీరు డబ్బులు ఇచ్చి గెలుస్తున్నారు.
అటువంటి పనులు హుజూరాబాద్‌లో కొందరు చెంచాగాళ్లను పెట్టుకుని దొంగ దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు ఇక్కడ ఎన్నికలు అంటే జరిగితే కురుక్షేత్ర యుద్ధం జరగనుంది. ఇక్కడ న్యాయయుద్ధం జరుగుతుంది. హుజురాబాద్ ప్రజలే ఇక్కడ గెలుస్తారు. మీ చిల్లర పనులతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే వాటికి ప్రజలు ప్రభావితం కారు' అని ఈటల ఘాటైన పదజాలంతో మండిపడ్డారు.