ట్రాఫిక్‌ చలానాలపై అదిరిపోయే ఆఫర్.. ఏంటది?

మంగళవారం, 1 మార్చి 2022 (12:03 IST)
తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసులకు వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు ట్రాఫిక్‌ చలానాలపై అధికారులు పెద్ద మొత్తంలో ఆఫర్‌ ప్రకటించారు.  
 
ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలలో అధికంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులే ఉండే అవకాశం ఉంది. హెల్మెట్లు ధరించకపోవడం, ఓవర్‌ స్పీడ్‌ లాంటి చలానాలే అధికం ఉంటున్నాయి.
 
దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వాహనదారులకు భారీ ఊరట కలిగించారు. వాహనాదారులు పెండింగ్‌లో ఉన్న చలానాల మొత్తంలో 25 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే 75శాతం రాయితీ ఉంటుంది.
 
ఓ ద్విచక్ర వాహనదారునికి వివిధ ఉల్లంఘనల కింద రూ.10వేల చలనాలు ఉంటే ఆ మొత్తానికి రాయితీలో భాగంగా రూ.2500 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.  
 
అలాగే ఇక కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది మాస్క్‌లు లేకుండా రోడ్లపై తిరిగారు. అలాంటివారిపై పోలీసులు కొరఢా ఝుళిపించారు. 
 
మాస్క్‌లేకుండా రోడ్లపై తిరిగే వారికి పోలీసులు రూ.1000 జరిమానా విధించారు. వారికి కూడా భారీ రాయితీ కల్పించారు అధికారులు.  దీని ప్రకారం.. రూ.1000 జరిమానా ఉంటే కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఇక వాహనదారులు పెండింగ్‌లో ఉన్న చలనాలను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.  
 
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 కోట్లకుపైగా పెండింగ్‌ చలనాలు ఉన్నట్లు పోలీసు శాఖ గణాంకాలు చెబుతున్నాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు