తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ పెడతానని, 2019లో పోటీ చేస్తానని సినీనటుడు పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం చేసిన ప్రకటన ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. పవన్ కల్యాణ్ ప్యాకప్ బాయే కానీ, పొలిటికల్ మ్యాన్ కాదని గతంలోనే కొట్టి పడేసిన తెరాస్ ఎంపీ కల్వకుంట్ల కవితతోపాటు అనేకమంది తెలంగాణ నేతలు పవన్ ప్రకటనపై స్పందిస్తూనే ఉన్నారు. తెలంగాణ సమస్యలు పవన్‌కి ఏం తెలుసుని ఇక్కడా పార్టీ తెరిచి పోటీ చేస్తాడన్నదే వీరిలో చాలామంది ఆరోపణ.
తాజాగా తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం పవన్ ఉద్దేశాలను ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయని, నటుడు పవన్ కల్యాణ్ ముందు తెలంగాణ సమస్యలపై అవగాహన తెచ్చుకుని... కల్పించుకొని, ఆ తర్వాత పార్టీ పెడితే బాగుంటుందని రేవంత్ సలహా ఇచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బాహుబలి, పవన్ కల్యాణ్ పదాలకు బాగా డిమాండ్ పెరిగినట్లు కనబడుతోంది. తెరాస పని పట్టే బాహుబలి తామంటే తామేనని ఇక్కడి రాజకీయ నేతలు పోటీపడుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై మాట్లాడారు. త్వరలోనే తాను కాంగ్రెస్‌లో చేరిపోవచ్చని వస్తున్న రూమర్లను ఖండించిన ఆయన రూరల్ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లోకి వచ్చే బాహుబలిని తాను కాదని స్పష్టం చేశారు. అయితే, సీఎం కేసీఆర్ చరిత్రంతా తెలిసిన మంత్రి హరీశ్‌రావు కావచ్చు, లేదా సీఎల్పీ నేత జానారెడ్డి కుమారుడైనా త్వరలో కాంగ్రెస్‌లో చేరవచ్చని రేవంత్ చెప్పారు,