రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుంది : హరీష్ రావు

సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (10:20 IST)
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం ఆ రాష్ట్ర విత్తమంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తామన్నారు. 
 
అదేసమయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోయినా.. అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనతో బడ్జెట్‌ కేటాయింపులు చేశామన్నారు. 
 
అభివృద్ధి, సంక్షేమంలోనూ దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరిస్తున్నదని పేర్కొన్నారు. బడ్జెట్‌కు కేబినెట్‌తోపాటు గవర్నర్‌ ఆమోదం కూడా లభించిందని వెల్లడించారు. మండలిలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని చెప్పారు.
 
ఇదిలావుంటే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెడుతారు. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్‌‌అండ్‌‌బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. గత యేడాది మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు