ఎన్ని కోట్లయినా మళ్ళీ ఆ ఆలయం, మసీదులను నిర్మిస్తా: కేసీఆర్

శుక్రవారం, 10 జులై 2020 (16:21 IST)
సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదు కొంత దెబ్బ తినడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ ప్రాంతంలోనే ఇప్పుడున్న వాటికన్నా విశాలంగా, గొప్పగా కొత్తగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ప్రకటించారు. 
 
‘‘సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మించడం కోసం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ జరుగుతున్నది. దీనిలో భాగంగా ఎత్తయిన భవనాలను కూల్చివేసే సందర్భంలో కొన్ని శిథిలాలు, పెచ్చులు దేవాలయం, మసీదులపై పడ్డాయి. దీనివల్ల వాటికి కొంత ఇబ్బంది కలిగింది.
 
ఇది నాకు ఎంతో బాధ కలిగించింది. చాలా విచారకరం. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నాను. ప్రభుత్వ ఉద్దేశ్యం పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం. అంతే తప్ప మసీదు, దేవాలయాలను చెడగొట్టడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదు. సెక్రటేరియట్ ప్రాంతంలోనే కొత్తగా దేవాలయం, మసీదులను ఎన్ని కోట్లయినా సరే వెచ్చించి, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తాం. 
 
ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా, సౌకర్యవంతంగా దేవాయలం, మసీదుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. నేనే స్వయంగా దేవాలయం, మసీదు నిర్వాహకులతో సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వం నిర్మాణాలను చేపడుతుంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
 
ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: హోంమంత్రి
తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా కొత్త మసీదును, దేవాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు.

ప్రస్తుతం పాత సెక్రటేరియట్ భవనంలో ఉన్న మసీదు, దేవాలయాల కన్నా పెద్ద స్థాయిలో వాటిని నిర్మించేందుకు సెక్యులర్ నాయకుడైన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, దీనికి సంబంధించి త్వరలోనే నిర్వాహకులతో మాట్లాడేందుకు సమావేశాలు నిర్వహించనుండడం పట్ల హోంమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

నూతన సెక్రటేరియట్  భవనాన్ని అధునాతన స్థాయిలో నిర్మించడం పట్ల అది ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని హోం మంత్రి అన్నారు.

నూతన భవనంలో సాంకేతిక, ఇతర సౌకర్యాలతో కూడిన సదుపాయాలు ఉండడం వల్ల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనకరమని హోం మంత్రి తెలియజేశారు. మసీదు, దేవాలయాలు కూడా భారీ ఎత్తున నిర్మించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మహమూద్ అలీ స్వాగతించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు