రాయలసీమను రతనాల సీమగా చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లుందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రాయలసీమను సస్యశ్యామలం చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసే చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను అడ్డుకోవడంలో ప్రభుత్వ తీరుపై సందేహాలున్నాయన్నారు.
కేసీఆర్‌కు రాష్ట్ర ప్రయోజనాల కంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని పేర్కొన్నారు. అందుకే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారన్నారు.
ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చర్చకు రాకపోతే కేసీఆర్ కాంట్రాక్టర్ల ప్రతినిధిగా పనిచేస్తున్నారనే ఆరోపణలు నిజమని స్పష్టం అవుతోందని వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ లేఖ యధాతథంగా...
గౌరవ ముఖ్యమంత్రి గారు...
విషయం: పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ద్వార ఆంధ్రరాష్ట్ర జలదోపిడిపై మీ ప్రభుత్వానికి గల చిత్తశుద్ధిపై బహిరంగ చర్చ.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత మీపై ఉన్నది, కానీ ఈమధ్య రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే, మీరు తెలంగాణ గడ్డపై ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చక పోగా, రాయలసీమ గడ్డపై చేసిన బాస "రాయలసీమను రతనాలసీమ చేస్తా" అనే హామీని నెరవేర్చడానికి మాత్రం కంకణబద్ధులై ఉన్నట్లున్నారు.
రాయలసీమను సస్యశ్యామలం చేసే విషయంలో మాకే అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ, ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తీవ్ర నష్టం కలిగేలా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ద్వారా తలపెట్టిన జలదోపిడీని నివారించడంలో, రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను అడ్డుకోవడంలో మీరు, మీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనేక సందేహాలను లేవనెత్తుతుంది.
ఆగస్టు 5న వీడియో కాన్ఫరెన్స్ ద్వార ఉన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని మీరు ఎగొట్టి, రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారయ్యే ఆగస్ట్ 19 వ తేదీ తరువాతే సమావేశానికి హాజరయ్యే వెసులుబాటు సాధ్యం అనడం ద్వార రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల కన్నా మీకు కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యం అనే సందేహాలు కలుగుతున్నవి.
ఇలాంటి అనేకానేక సందేహాలు తెలంగాణ యువకులు, మేధావులు, సాగునీటి నిపుణుల మదిని తొలుస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ సందేహాలను తీర్చ వలసిన బాధ్యత మీపై ఉన్నదని ఒక పౌరునిగా నేను భావిస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలదోపిడి పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలకు అన్ని విషయాలు తెలియాలనే భావనతో, ఈ అంశంపై తెరాస నాయకులను బహిరంగ చర్చకు రావాల్సిందిగా నేను ఆగస్ట్ 8న పత్రికా ముఖంగా సవాలు చేసి మూడు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎవరూ స్పందించక పోవడం అనేక అనుమాలకు తావిస్తుంది.
ఈ సందర్బంగా నేను మీకోక విషయం గుర్తు చేస్తున్నాను. 2017 ఫిబ్రవరి నెలలో నేను కల్వకుర్తి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 29లో భాగమైన డి82 ఉపకాలువ సామర్ధ్యం తగ్గించడం ద్వార, మా నియోజకవర్గం లోని 37,774 ఎకరాల ఆయకట్టును తొలగించారనే ఆరోపణ చేసినప్పుడు, ప్రస్తుత మంత్రి, నాటి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి నోరంజన్ రెడ్డి గారు నా ఆరోపణలను అవాస్తవాలని నిరూపిస్తానని చెప్పి నన్ను బహిరంగ చర్చకు రమ్మనే సవాలు చేసారు.
నీతీ, నిజాయతీతో నేను చేసిన ఆరోపణలలో నిజం ఉందనే విశ్వాసంతో బహిరంగ చేర్చను స్వీకరించి ఫిబ్రవరి 10న సోమజిగూడ ప్రెస్ క్లబ్బులో మేమిద్దరం పాత్రికేయుల సమక్షంలో బహిరంగ చర్చలో పాల్గొన్నాం. నిరంజన్ రెడ్డి గారి పెద్దరికాన్ని, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా అనేక అంశాలను సామరస్యంగా చర్చించి కల్వకుర్తి రైతాంగానికి మేలుజరిగే విధంగా డి82 ఉపకాలువ పొడిగింపు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఆనాడు తెరాస నాయకునిగా నిరంజన్ రెడ్డి గారు నాకు బహిరంగ చర్చకు చేసిన సవాలును నేను హుందాగా స్వీకరించడం జరిగింది. కానీ ఇవ్వాళ ఇంత ప్రాధాన్యత కలిగిన అంశంపై అనేక సందేహాలు, అనుమానాలు రేకెత్తుతున్న తరుణంలో నేను విసురుతున్న బహిరంగ చర్చ సవాలుకు తెరాస నాయకులు ఎందుకు జంకుతున్నారో అర్థం కావడం లేదు. ఇలా చర్చకు దూరంగా ఉండడం వల్ల ప్రజలు మీ చిత్తశుద్ధిని మరింత శంకిస్తారు.
నేను ఆగస్టు 8న సవాలు చేసినప్పుడు తేది, సమయము, ప్రదేశము తెరాస నాయకులే తెలుపాలని, నేను ఎన్నడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమే అని చెప్పినప్పటికీ ఇంతవరకు ఎవరూ స్పందించనందుకు, ఇప్పుడు నేనె 12వ తేదీన ఉదయం 11 గంటలకు సోమాజిగూడా ప్రెస్ క్లబ్బుకు మిమ్మల్ని బహిరంగ చర్చకు ఆహ్వానిస్తున్నాను.
దయచేసి మీ తరపున మీ ప్రతినిధిని చర్చకు పంపి, మన రాష్ట్ర ప్రయోజనాల పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుతున్నాను. అలా కాని యెడల, అందరు అనుమానిస్తున్నట్లుగా మీరొక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా కాంట్రాక్టర్ల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారనే అనుమానాన్ని నిజమని రుజువు చేసుకున్నట్లు ఔతుంది.
ఈ విషయం పట్ల మీరు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ, మీ ప్రతినిధి రాకకై బుధవారం 12 ఆగష్టు , ఉదయం 11 గంటలకు సోమజిగూడా ప్రెస్ క్లబ్బులో వేచిచూస్తూ ఉంటాను. చర్చకు మీ తరపున ఎంతమంది ప్రతినిధులను పంపినా నాకు సమ్మతమే అని తెలుపుతూ సెలవు.