హిత్రాస్ అత్యాచార ఘటన తెలిశాక తనకు ప్రతిఘటన చిత్రంలోని పాట గుర్తుకు వస్తుందని సినీ నటి, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నెల 14న అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు కామాంధులు, అనంతరం ఆమె నాలుకను కోసి దారుణానికి తెగబడిన ఘటన చోటుచేసుకుంది.
యూపీలో తన పిల్లలతో కలసి బస్సు ఎక్కిన ఒక వివాహితపై ఇద్దరు డ్రైవర్లు దారుణంగా అత్యాచారం చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ఎందరు పోలీసులు ఉన్నా, నైతికంగా సమాజం శక్తిమంతంకానంత వరకూ ఈ వ్యవస్థలో ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయని ఆమె అన్నారు.
బాధిత కుటుంబాలను చూసి జాలి పడి ఆగిపోవద్దని, రేపటి బిడ్డలు కూడా ఇదే సమాజంలోకి అడుగుపెడతారన్న వాస్తవాన్ని మరచిపోవద్దని ఆమె చెప్పారు. మన మనుగడకు, జాతి గౌరవానికి మూలం మహిళేనని గుర్తించాలని, ఇప్పటికైనా మేలుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళ గర్వపడేలా మన సమాజాన్ని తీర్చిదిద్దుకుందామని విజయశాంతి చెప్పుకొచ్చారు.