ఐసీయులోని రోగిని కొరికిన ఎలుకలు.. తీవ్ర రక్తస్రావం

గురువారం, 31 మార్చి 2022 (13:28 IST)
వరంగల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఐసీయు వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరికాయి. దీంతో ఆయన తీవ్ర రక్తస్రావమైంది. కాళ్లు, చేతులు కొరికేయడంతో ఆ రోగికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
వరంగల్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయు వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ వార్డులోని ఎలుకలు ఆ రోగి కాళ్లు, చేతులు కొరికివేశాయి. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. 
 
ఈ ఘటనతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఎలుకలు తరిమేసి శ్రీనివాస్‌కు వైద్యం చేశారు. అయితే, ఈ విషయం తెలిసిన రోగి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉండే ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని వారు వాపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు