ప్రతి అభిమానికి తమ అభిమాన నటీనటుల గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. ఇష్టమైన హీరోయిన్ల గురించి నెట్‌లో అదే పనిగా సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేస్తే అది మీ కొంప ముంచుతుంది. ఆ సెర్చింగ్ మీ డివైజ్‌లను వైరస్ బారిన పడేలా చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ సొనాక్షి సిన్హా పేరుతో సెర్చ్ చేస్తున్నట్లయితే.. మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, మొబైల్‌లు ఏవైనా 11.11 శాతం వైరస్ బారిన పడే అవకాశాలు అధికంగా ఉంది.
ఈ పరిశోధనను ఇంటెల్ సెక్యూరిటీ జరిపించి.. మీ డివైజ్‌లను వైరస్ బారిన పడేసే బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లను వెల్లడించింది. ఆ జాబితాలో సొనాక్షి సిన్హా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సొనాక్షి పేరుతో సెర్చింగ్ ప్రారంభించగానే హ్యాకర్లు మీ డివైజ్‌లపై దాడి మొదలు పెట్టేసే ప్రమాదం 11.11 శాతం ఎక్కువగా ఉంటుంది.
సొనాక్షి తర్వాతి స్థానంలో ఫర్హాన్ అక్తర్ (9.56), కరీనా కపూర్ (8.67), టైగర్ ష్రాఫ్ (8.44), అర్జున్ కపూర్ (8.44) ఉన్నారు. భారతీయులకు, బాలీవుడ్ సినిమాలకు ఉన్న అనుబంధాన్ని హ్యాకర్లు తెలివిగా ఉపయోగించుకుంటున్నారని, సినిమా వాళ్ల పేర్లతో సెర్చింగ్ ప్రారంభిస్తే.. డివైజ్‌లు వైరస్ బారిన పడే ప్రమాదం 21 శాతం పెరుగుతుందని ఇంటెల్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది.