రజినీకాంత్ గారిని చూశాక నా మనసు మార్చుకున్నా : ఏఆర్ రెహమాన్
శనివారం, 3 నవంబరు 2018 (17:28 IST)
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం '2.0'. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా '2.0' చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, కరణ్ జోహర్ సమర్పణలో సుభాష్ కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అంతేకాకుండా పూర్తిగా త్రిడి ఫార్మాట్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా '2.0' కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్‌లో సౌండ్ డిజైన్ చేయడం మరో విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్ 3న చెన్నైలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా... హీరోయిన్ ఎమీ జాక్సన్ మాట్లాడుతూ ''నేను చాలా నెర్వస్‌గా ఉన్నా. రజనీకాంత్‌గారితో కలిసి పనిచేయడం చాలా గొప్ప గౌరవం. దర్శకనిర్మాతల వల్లనే నా కల నెరవేరింది. యానిమేట్ చేసిన రోబోలాగా నటించాను. రోబోలాగా డ్యాన్స్ చేయమన్నారు. చిట్టి, నా పాత్రలు చాలా బాగా ఉన్నాయి. శంకర్ మూడేళ్ల ముందు చెప్పిన కథ ఈ రూపం రావడానికి వేల మంది పనిచేశారు. రజనీగారితో, అక్షయ్ గారితో నేను పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నీరవ్‌గారితో మూడో సినిమా చేస్తున్నా. ముత్తురాజ్‌గారు చాలా కష్టపడ్డారు. 4డీ గురించి కూడా నాకు తెలియదు. ఆంటోనీతో నాలుగో సినిమా చేశాం. రెహమాన్‌గారు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. సుభాష్ కరణ్‌కి థాంక్స్'' అని అన్నారు.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ''2, 3 గంటలు ప్రాక్టీస్ చేసి తమిళ్‌లో రాసుకుని మాట్లాడుతున్నా. ఆనందంగా ఉంది. రజనీసార్, శంకర్‌సార్, రెహమాన్‌గారితో కలిసి '2.0'లో నా పేరు కూడా ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం నన్ను అప్రోచ్ అయిన టీమ్‌కి ధన్యవాదాలు'' అని అన్నారు. అనంతరం విశాల్ అడిగిన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నకు అక్షయ్ సమాధానమిస్తూ ''నాకు నా జిమ్ ఉంది. నేను ప్రతి రోజూ ఉదయం 4 గంటలకు లేస్తా. మా నాన్న ఆర్మీలో ఉండేవారు. నా చిన్నతనం నుంచి చేస్తున్నా. నా లైఫ్ స్టైల్ నాకు ఇష్టం. ఎవరూ నన్ను ఇలాగే చేయమని ఫోర్స్ చేయలేదు. నా జీవితంలో ప్రతి రోజూ నేను సన్‌రైజ్‌ని చూస్తాను. నేను ప్రతి రోజునూ, ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తాను. నాకు నా శరీరమే దేవాలయం. మా నాన్న నాకు అదే నేర్పించారు. నాకు విశాల్ గురించి తెలుసు. తను అన్నం తినడని నాకు తెలుసు. వాళ్ల అమ్మకు అది నచ్చదని కూడా నేను చదివా. కనీసం ఆదివారమైనా అన్నం, దోసలు, ఇడ్లీలు తినాలని ఆశిస్తున్నా'' అని అన్నారు.
ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ''ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నా. శంకర్ నా దృష్టిలో సైంటిస్ట్. ఆయన డైరక్టర్ మాత్రమే కాదు, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. మూడున్నర గంటలు కూర్చుని మేకప్ చేసుకోవడం, ఏడాదిన్నర దాన్ని తీసుకోవడం నేను మర్చిపోలేను. నేను గత 28 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇన్నేళ్లుగా వేసుకున్న మేకప్ మొత్తం ఈ సినిమాకు వేసుకున్న మేకప్‌తో సరితూగదు. ఈ సినిమా నాకు ఇచ్చినందుకు శంకర్‌గారికి ధన్యవాదాలు'' అని అన్నారు.
ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ''ఈ సినిమాలో ముందు మేం పాటలు లేవనుకున్నాం. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోరే అనుకున్నాం. కానీ ఇప్పుడు నాలుగు పాటలున్నాయి. ఇందిరలోకం.. అనే పాటకోసం దాదాపు 12, 13 ట్యూన్ల తర్వాత శంకర్‌గారు ఈ ట్యూన్ సెలక్ట్ చేశారు. ముందు రీరికార్డింగ్‌ని కీబోర్డ్, కంప్యూటర్స్‌లో కంపోజ్ చేశాం. నెల రోజుల క్రితం 100 మంది ఆర్కెస్ట్రా లండన్లో, ముంబైలో 40 మంది, చెన్నైలో ఇంకొంతమందితో చేశాం. అయినా విజువల్స్ కొన్నిటిని చూసినప్పుడు నేను చేసిన సంగీతం చాల్లేదనిపించింది. ఇప్పుడు ఇంకా చేశాం. సినిమాకన్నా వారం రోజుల ముందు రీరికార్డింగ్‌లో కొంత భాగాన్ని రిలీజ్ చేస్తాం. ఒక పర్సనాలిటీ లైక్ చేయాలంటే వాళ్లు.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు. వాళ్ల జీవితం ఎలా ఎగ్జాంపుల్‌గా ఉంది వంటి విషయాలను గురించి ఆలోచిస్తాం. నాకు రజనీకాంత్‌గారు చాలా రకాలుగా స్ఫూర్తినిచ్చారు. ఆయన స్పిరిచువాలిటీగానీ, ఆయన సినిమాలోని చిన్న చిన్న డైలాగులుగానీ నాకు ఇష్టం.
ఈ వయసులోనూ ఇలాంటి సినిమాలు చేయాలని ఆశ ఉండటం చాలా గొప్ప. చిన్నతనం నుంచి సంగీత రంగంలో ఉండటం వల్ల నేను 40 ఏళ్లప్పుడు రిటైర్ కావాలని అనుకున్నా. అప్పుడే 'రోబో' సినిమా చేస్తున్నా. ఆ సెట్‌కి వెళ్లి రజనీకాంత్‌గారిని చూశాక , ఆఫ్ సెట్, ఆన్ సెట్ ఆయన్ని చూశాక నా మనసు మారింది. ఇవాళ నేను సంగీత రంగంలో ఉండటమే గొప్ప కటాక్షంగా భావిస్తున్నా. నా తండ్రి ద్వారా వచ్చిన గౌరవంగా భావిస్తున్నా. ఆ గౌరవాన్ని స్వీకరించి సర్వీస్ చేస్తున్నా. మా నాన్నకి, గాడ్‌కీ సంగీతంతో సంగీతం చేస్తున్నా. '2.0'కి పనిచేసిన అనుభవం అనేది 8 సినిమాలు చేసినట్టు అనిపిస్తోంది. నాలో చాలా మార్పు వచ్చింది. నేను 3 ఏళ్లు ముందు వేరు., 2 ఏళ్ల ముందు వేరు. ఇప్పుడు వేరు. ఇందాకే చెప్పినట్టు గత రెండు నెలలుగా సినిమాలోని ఎఫెక్ట్స్ చూసినప్పుడు నా సంగీతం వాటి ముందు చాల్లేదనిపించింది. అందుకే ఇంకా కృషి చేశా. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ చాలా పెద్ద ఇన్‌స్పయిరింగ్ రోల్ చేశారు. సుభాష్ కరణ్‌గారు, రసూల్ పూకొట్టి, ఇంకా చాలా చాలా మంది క షి చేశారు. 'ఇందిర లోకం' పాట రాసిన కీర్తిశేషులు ముత్తకుమార్‌కీ, మా అబ్బాయి ఎ.ఆర్.అమీన్‌కీ థాంక్స్'' అని అన్నారు.