ఆయన మరణించి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ, ఆయన గానామృతం మాత్రం ఇప్పటికీ సంగీతప్రియులను అలరిస్తూనే ఉంది. భక్తి గీతాలు, యుగళ గీతాలు, విషాద గీతాలు.. ఇలా అన్ని రకాల పాటలను ఆయన తన స్వరంలో అద్భుతంగా పలికించారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. స్వర మాంత్రికుడు ఘంటసాల వెంకటేశ్వర రావు. సంగీత ప్రపంచాన్ని ఊలలాడించిన ఆయన జీవిత చరిత్ర ఇపుడు దృశ్యకావ్యంగా రానుంది.
నిజానికి ప్రతి జీవితం వెనుక ఓ కఠోర కష్టాలున్నట్లే ఘంటసాల జీవితంలో కూడా కష్టనష్టాలు ఎన్నో ఉన్నాయి. కెరియర్ ఆరంభంలో ఘంటసాల ఎన్నో కష్టాలు పడ్డారు. విజయనగరంలో సంగీత సాధన చేసే రోజుల్లో జోలె పట్టి ఇంటింటికీ తిరిగి ఆహారాన్నిఅడుక్కుని ఆరగించారు. పొట్టకూటి కోసం ఘంటసాల పడిన ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఈ స్థితి నుంచి సంగీత రంగంలో రారాజుగా వెలిగిన అతని జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలయ్యాయి.
ఘంటసాల పాత్రలో ఇమిడిపోయేలా ఉండే నటుడు కోసం గాలిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో పాతతరానికి చెందిన అనేక నటీనటుల పాత్రల్లో నేటితరం హీరోలు, హీరోయిన్లు కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతం కావాల్సివుంది.