దాసరి పేరు ప్రస్తావించకపోవడం విచారకరం : నిర్మాత సి.కళ్యాణ్

బుధవారం, 4 మే 2022 (11:23 IST)
మే ఒకటో తేదీన హైదరాబాద్ నగరంలో జరిగిన మే డే ఉత్సవాల్లో దివంగత దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణ రావు పేరును ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రస్తావించకపోవడం విచారకరమని నిర్మాత సి.కళ్యాణ్ అన్నారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సినీ కార్మికోత్సవం జరిగింది. ఇందులో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వంటి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. 
 
దీనిపై సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో దివంగత దాసరి నారాయణ రావు గురించి కనీసం మాటమాత్రం కూడా ప్రస్తావించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. దాసరి నారాయణ రావు లేకుండా సినీ కార్మికులు లేరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. సినీ కార్మికులు దాసరి, సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డిలను విస్మరించడం సరికాదన్నారు. 
 
మరోవైపు, నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ వివరణ ఇచ్చారు. సినీ కార్మికోత్సవంలో దాసరి నారాయణ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దండ వేయడం మరిచిపోయామన్నారు. తాము చేసింది తప్పేనని ఆయన అంగీకరించారు. ఇకపై తాము ఏ కార్యక్రమం చేపట్టినా దాసరికి సముచిత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు