హైదరాబాద్ ఫిలిం క్లబ్ అధ్యక్షుడు కె.వి.రావు మాట్లాదుతూ, హైదరాబాద్ నగర ప్రజలకు దేశ, విదేశ అత్యుత్తమ చిత్రాలను సదాశయంతో 50 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ క్లబ్ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూనే ఉన్నదని అన్నారు. శ్రీ సారధీ స్టూడియోస్ సుదీర్ఘమైన సహకారం అందించడం వల్లనే క్లబ్ మనుగడ సాధ్యమైందని చెప్పారు. 29వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ న్యూఢిల్లీ, కోల్ కటా తర్వాత హైదరాబాద్ లోనే జరుగుతుండటం, దానిని మా క్లబ్ నిర్వహిస్తుండటం ఓ విశేషమని అన్నారు.
హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, మనదేశంలో పేరున్న అతి కొద్ది ప్రైవేట్ ఫిల్మ్ సొసైటీలలో, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఒకటని అన్నారు. తాము చేసిన అనేక ఫెస్టివల్స్ సినీ ప్రియులను ఎంతగానో అలరించాయని, కొన్ని గొప్ప మైలు రాళ్లు కూడా తమ క్లబ్ సొంతమని అన్నారు. తమ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని అన్నారు.
ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ, ఫిల్మ్ ఫెస్టివల్స్ ను రెగ్యులర్ గా నిర్వహించేందుకు సినీ రంగంతో పాటు ప్రభుత్వ సహకారం అత్యంత ఆవశ్యకమని అన్నారు. తప్పకుండా ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకుని వెళ్లి, తద్వారా ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరే ప్రయత్నం చేస్తామని అన్నారు. హైదరాబాద్ వేదికగా రెండేళ్లకు ఒకసారి జరిగే చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా తిరిగి యథావిధిగా జరుగుతుందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని అన్నారు..
ఇదే వేడుకలో పాల్గొన్న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు, సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ, ఇంకా పొన్నం రవిచంద్ర, మౌడ్ మిక్కుయాన్, పూనమ్ కపిల్ తదితరులు అంతా ఫిల్మ్ ఫెస్టివల్స్ లోని సినిమాల వల్ల ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల కల్చర్ ని, తెలుసుకోవడమే కాదు అందులోని మంచిని మనం ఆచరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఫిల్మ్ ఫెస్టివల్స్ తరచుగా జరిగేందుకు ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరమని వారంతా ఉద్గాటించారు.