'గౌతమిశాతకర్ణి దండయాత్ర' 2017 జనవరి 12 నుంచి.. సంక్రాంతికి సందడే

సోమవారం, 2 జనవరి 2017 (15:02 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమాగానేకాకుండా, అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక  మహారాజు "శాతకర్ణి" జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా యావత్ ప్రపంచంలోని తెలుగు సినిమా అభిమానులందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి". "శాతకర్ణి"గా నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహార్యం తెలుగువారిని అమితంగా ఆకట్టుకోగా, "గౌతమిపుత్ర శాతకర్ణి" టీజర్, ట్రైలర్ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇక చిరంతన్ భట్ స్వరపరిచిన బాణీలతే సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తూ.. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆశగా ఎదురుచూసేలా చేసింది.  
 
ప్రేక్షకుల, నందమూరి అభిమానుల ఎదురుచూపులకు సమాధానంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబులు "గౌతమిపుత్ర శాతకర్ణి" విడుదల తేదీని నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించారు. సినిమా ప్రారంభోత్సవం రోజే "సంక్రాంతి సినిమా" అని సినిమా యూనిట్ సభ్యులందరూ సగర్వంగా ప్రకటించిన ఈ చిత్రం అన్నమాట ప్రకారం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబులు మాట్లాడుతూ.. "నందమూరి బాలకృష్ణతో పనిచేయాలన్న మా కోరిక "గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి అద్భుతమైన సినిమా ద్వారా తీరడం చాలా సంతోషంగా ఉంది. బాలయ్య 100వ సినిమా అయిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తుండడం మాకు గర్వకారణం. మోరోకో, మధ్యప్రదేశ్ ప్రదేశాల్లో చిత్రీకరించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ చూపిన తెగువ, ఆయన అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిదన్నారు.
 
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినీలు పోషించిన ప్రత్యేక పాత్రలు సినిమాకి ఆయువుపట్టు. మా క్రిష్ ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌గా రూపొందించడంతోపాటుగా తెలుగువారికి తెలియని తెలుగోడు "శాతకర్ణి" ఘనకీర్తిని అద్భుతంగా తెరకెక్కించాడు. శాతవాహన రాజుల్లోకెల్లా అత్యంత శూరుడైన "శాతకర్ణి" చరిత్రతో ఈ సంక్రాంతికి శుభారంభాన్నిద్దాం. పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్‌లోనే చూడాల్సిందిగా నిర్మాతలుగా మా మనవి" అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి