బాలీవుడ్ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు సొంత నిర్మాణ సంస్థనూ ప్రారంభించింది. ఆమెకు విశేష ఖ్యాతిని తెచ్చిన 'మణికర్ణిక' చిత్రం పేరునే కంగనా తన బ్యానర్‌కు పెట్టడం విశేషం.
అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా 'టికు వెడ్స్ షేరు' పేరుతో సినిమా తీయబోతున్నట్టు కంగనా తెలిపింది. నిజానికి నటనతో పాటు కంగనా రనౌత్ కు చిత్ర నిర్మాణం, దర్శకత్వం మీద కూడా మక్కువ ఉంది.
ఇప్పుడు ఆమె భారీ, క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న కారణంగా ఈ లవ్ స్టోరీకి దర్శకత్వం వహించే అవకాశం లేదు. కానీ భవిష్యత్తులో తన సొంత బ్యానర్ నుండి వచ్చే ఫీచర్ ఫిల్మ్స్ కోసం కంగనా మెగా ఫోన్ చేతిలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... కంగనా రనౌత్ నటించిన జయలలిత బయోపిక్ 'తలైవి' విడుదలకు సిద్ధంగా ఉంది.