బాహుబలి2 సినిమా ముగిసిన తర్వాత చలన చిత్రాలకు సంగీత దర్శకత్వం మానేస్తానని ముందే ప్రకటించిన ఎంఎం కీరవాణి అన్నంత పనీ చేశారు. ఆదివారం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి2 ప్రీ రిలీజ్ కార్యక్రమం జరగడానికి ముందు ట్విట్టర్‌లో తన రిటైర్మెంటును కీరవాణి ప్రకటించగానే సంచలనం కలిగింది. తర్వాత ఎవరి ఒత్తిడి వల్లనో ఏమో కానీ నా సొంత నిబంధనల మేరకే స్వరకర్తగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తానని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు కీరవాణి. 27 సంవత్సరాలుగా సంగీత దర్శకత్వంలో తలపండిపోయిన కీరవాణి తెలుగు చిత్రపరిశ్రమలో బుర్ర తక్కువ దర్శకుల కారణంగానే ఇకపై సంగీత దర్శకత్వం వహించలేనని చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన చెప్పిన కారణం షాక్ కలిగించింది.
సంగీత దర్శకుడు తన ఆధీనంలో ఉండడు అనే ఆలోచననే ఏ దర్శకుడూ ఇష్టపడడు కాబట్టి తెలుగు సినిమా దర్శకుల వద్ద పనిచేయడం చాలా కష్టం అంటూ కీరవాణి ధ్వజమెత్తారు. పైగా తాను పనిచేసిన దర్శకుల్లో కొందరు మూగ, చెవిటి అంటూ విమర్శించారు. చాలావరకు తాను బుర్ర తక్కువ దర్శకులతోనే పనిచేశానని, వాళ్లు తన మాటలు వినేవారు కాదని కీరవాణి చెప్పారు. దర్శకులు తనను ఓ సంగీత దర్శకుణ్ణి మాత్రమే అనుకుని, మంచి సలహా ఇచ్చినా తీసుకోరన్నారు. కథ వినేటప్పుడే నేను సంగీత దర్శకత్వం వహించిన చాలా చిత్రాలు ఫ్లాప్ అవుతాయని ఊహించా అంటూ తన చేదు అనుభవాలను విప్పి చెప్పారు కీరవాణి,. అందుకే తన శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఇంకొన్నాళ్లు సంగీత దర్శకుడిగా కొనసాగితే... మాట వినని, మాట్లాడని దర్శకులతో ప్రయాణించనని కరాఖండిగా చెప్పేశారు.
అదే సమయంలో రాజమౌళిని కీరవాణి ఆకాశానికి ఎత్తేశారు. రాజమౌళికి నేను బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కారణం అతను తన మాట వింటాడు అని స్పష్టం చేసారు కీరవాణి. రాజమౌళికి పని పట్ల భక్తి, ప్రేమ ఉన్నంత వరకూ అతని స్టాండర్డ్స్‌ను ఎవరూ చేరుకోలేరు. ఇది వంద శాతం నిజం. ఇది నా వేదవాక్కు అని కీరవాణి జోస్యం చెప్పారు.