జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ''జనతా గ్యారేజ్''. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై రోజురోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. టీజర్ వచ్చాకైతే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎపుడెపుడు రిలీజ్ అవుతుందాని ఎదురుచూస్తున్నారు. అతి తక్కవ సమయంలో ఎక్కువ మంది చూసిన టీజర్‌గా రికార్డు బద్దలు కొట్టింది 'జనతా గ్యారేజ్'. ''మిర్చి'', ''శ్రీమంతుడు'' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హిట్ డైరెక్టర్ కొరటాల శివ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న జనతా గ్యారేజీని ఒక్క సమస్య మాత్రం బాగా ఇబ్బందిపెడుతోందట. ఆ సమస్య సృష్టిస్తుంది ఎవరో కాదు మాలీవుడ్ హీరో మోహన్ లాల్. ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తరువాత మోహన్ లాల్ పాత్రకే మాంచి క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాకి తన వాయిస్‌కి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని మోహన్‌లాల్ డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్ణయమే జనతా గ్యారేజీ టీమ్‌ని తెగ ఇబ్బంది పెడుతోంది. మోహన్‌లాల్ వాయిస్ టెస్ట్ చేసిన కొరటాల శివ... డబ్బింగ్ విషయంలో అసంతృప్తికి లోనవుతున్నాడట.
మోహన్ లాల్ ఒరిజినల్ వాయిస్ చాలా బొంగురుగా ఉందని, తెలుగులో మాట్లాడినా, అది తెలుగు పదంలా లేదని, కొన్ని పదాలు పలకడానికి మోహన్ లాల్ సతమతమవుతున్నాడని యూనిట్‌వర్గాలు అంటున్నాయి. దీంతో కొరటాల వేరే వారితో డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే మోహన్ లాల్ మాత్రం 'నేనే డబ్బింగ్ చెప్పుకుంటా' అని ఒంటి కాలు మీద నిలబడుతున్నాడట. దీంతో కొరటాల శివ ఏం చేయాలో తేలీక తల పట్టుకున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయంపై జనతా టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.